nagarjuna: 6, 7 తేదీల్లో పెళ్లి...15న రిసెప్షన్: నాగార్జున
- రెండ్రోజుల్లో టాలీవుడ్ మోస్ట హ్యాపెనింగ్ వెడ్డింగ్
- అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలకే ఆహ్వానం
- హిందూ, క్రైస్తవ సంప్రదాయాల్లో వివాహం
- ఆర్యసమాజ్ పధ్ధతి వివాహమంటే నాకు ఇష్టం
రెండు రోజుల్లో టాలీవుడ్ లో ‘మోస్ట్ హ్యాపెనింగ్ వెడ్డింగ్’ జరగనుండడంతో ఉద్వేగంగా ఉందని ప్రముఖ సినీ నటుడు నాగార్జున తెలిపారు. ఈ నెల 6,7న నాగచైతన్య, సమంతల వివాహం హిందూ, క్రైస్తవ సంప్రదాయ పద్ధతుల్లో గోవాలో జరగనుందని నాగార్జున తెలిపారు. ఈ కల్యాణ వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా జరుగుతుందని అన్నారు.
ఇక ఈ వేడుకలో కేవలం అక్కినేని కుటుంబ సభ్యులు, రామానాయుడి (చైతన్య తల్లి పుట్టింటివారు) కుటుంబ సభ్యులు, సమంత కుటుంబ సభ్యులు, అతి తక్కువ మంది సన్నిహితులు హాజరవుతారని ఆయన వెల్లడించారు. ఈ వివాహ వేడుకలో వధూవరులు రెండు వైపుల సంప్రదాయాలను గౌరవించాలని భావించడం తనకు చాలా బాగా నచ్చిందని అన్నారు.
తనకు వ్యక్తిగతంగా ఆర్యసమాజ్ పధ్ధతి వివాహం అంటే ఇష్టమని అన్నారు. తన వివాహం కూడా అదే సంప్రదాయం ప్రకారం జరిగిందని ఆయన తెలిపారు. ఆ సంప్రదాయంలో పాటించే ప్రతి వివాహం తంతుకి అర్థాలు చెబుతారని ఆయన తెలిపారు. నాగచైతన్య ఆడంబరాలకు దూరంగా వివాహం జరగాలని కోరుకున్నాడని అన్నారు.
రిసెప్షన్ గురించి అడిగితే వద్దని చెప్పాడని, దీంతో దాని గురించి నువ్వు ఆలోచించవద్దని, నేను చూసుకుంటానని 'చై'కి చెప్పానని ఆయన తెలిపారు. చై రిసెప్షన్ హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ నెల 15న జరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. దీనికి అందర్నీ ఆహ్వానిస్తానని నాగార్జున తెలిపారు.