ayodhya: కోర్టులను నమ్ముతున్నాం... మా పని మేము చేస్తాం: 'రామమందిరం'పై పరిపూర్ణానంద
- అయోధ్యలో ఆలయ నిర్మాణమే తుది లక్ష్యం
- 5 నుంచి ప్రారంభం కానున్న రామనామ జపం
- వంద కోట్ల సార్లు పఠించనున్న భక్తులు
- 10 నాటికి మహాయజ్ఞం పూర్తి
అయోధ్యలో రామమందిరం నిర్మించాలన్నది 100 కోట్ల మంది భారతీయుల కలని, దాన్ని నెరవేర్చేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తామని పరిపూర్ణానంద స్వామి వెల్లడించారు. ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మందిరం నిర్మాణానికి భగవంతుని సహకారం కోరుతూ వంద కోట్ల రామనామ జపాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు.
అయోధ్య కేసు సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తూ, తాము కోర్టులను నమ్ముతున్నామని, ఇదే సమయంలో ప్రజలకు మంచి సందేశాన్ని ఇస్తూ, భగవంతుని కృప కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తామని అన్నారు. రేపు ప్రారంభమయ్యే వంద కోట్ల రామనామ జపయజ్ఞం 15వ తేదీ వరకూ నిర్విఘ్నంగా సాగుతుందని పరిపూర్ణానంద అన్నారు. రామనామాన్ని సోషల్ మీడియా ద్వారా కూడా అందరికీ పంపిస్తుంటామని తెలిపారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అన్ని అనుమతులూ లభించాయని, కోర్టు కూడా సానుకూలంగానే స్పందించిందని వెల్లడించిన ఆయన, ముస్లిం సంఘాలు కూడా హిందువుల మనోభావాలను గౌరవిస్తున్నాయని గుర్తు చేశారు. తాము చేపట్టిన మహాయజ్ఞంలో నాలుగు వేదాలకూ హవనం, ఆంజనేయస్వామి వారి ఆరాధన, హనుమద్ ఉపాసన, చండీ, సుదర్శన ఉపాసన, రామయజ్ఞం, అన్నదానం ఉంటాయని, ఉత్తర భారతావనిలోని సాధు సంతువులు పాల్గొంటారని వెల్లడించారు. ప్రవాస భారతీయులు సైతం భాగం కానున్నారని పేర్కొన్నారు. తమకు రాముడు, ఆంజనేయుడే నేతలని అన్నారు.