tear: కన్నీటితో కరెంటు... సాధ్యమేనంటున్న శాస్త్రవేత్తలు
- గుడ్డుసొనతో కూడా విద్యుత్
- ఒక రకం ప్రోటీన్ మీద ఒత్తిడి కలిగించి ఉత్పత్తి
- మార్గం కనిపెట్టిన ఐరిష్ శాస్త్రవేత్తలు
కన్నీటి నుంచి, గుడ్డులో ఉండే తెల్లసొన నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే పద్ధతిని ఐర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లైమ్‌రిక్ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇక్కడి బెర్నాల్ ఇనిస్టిట్యూట్‌లో పనిచేసే పరిశోధకులు గుడ్డు తెల్లసొన, కన్నీటిలో ఉండే లైసోజైమ్ అనే మోడల్ ప్రోటీన్ మీద ఒత్తిడి కలిగించడం ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని వెల్లడించారు.
ఈ ప్రోటీన్ పక్షి గుడ్లలో, కన్నీళ్లలో, ఉమ్మిలో, పాలలో ఉంటుందని చెప్పారు. ఇలా ఒత్తిడి కలిగించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని డైరెక్ట్ పైజోఎలక్ట్రిసిటీ అంటారు. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చగల క్వార్ట్జ్ వంటి పదార్థాలకు ఈ లక్షణం ఉంటుంది. పీజోఎలక్ట్రిసిటీని ఎక్కువగా రెజొనేటర్లలో, సెల్ఫోన్లలో వైబ్రేషన్ కలిగించడం కోసం, అల్ట్రా సౌండ్ ఇమేజింగ్ పరికరాల్లో ఉపయోగిస్తారు. అయితే ఒక ప్రోటీన్ నుంచి విద్యుత్ ఉత్పత్తికి ఇప్పటివరకు పైజోఎలక్ట్రిసిటీ ప్రక్రియను ఉపయోగించలేదని, ఇంకా దాని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని పరిశోధకులు ఆమీ స్టేపుల్టన్ తెలిపారు.