prakash raj: ప్రధాని గురించి తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ ప్రకాశ్ రాజ్‌పై కేసు
- కేసు వేసిన న్యాయవాది
- లక్నో కోర్టులో నమోదు
- అక్టోబర్ 7న విచారణ
పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్య విషయంలో ప్రధాని మోదీ మౌనం వహిస్తున్నారని, ఆయన పెద్ద నటుడని ఇటీవల నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆయన మీద కేసు దాఖలైంది. లక్నోకు చెందిన ఓ న్యాయవాది అక్కడి కోర్టులో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విచారణ అక్టోబర్ 7న జరగనున్నట్లు సమాచారం.
ఇటీవల బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ప్రకాశ్‌రాజ్.. జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య గురించి మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. ఆమె తనకు మూడు దశాబ్దాలుగా తెలుసని, ఆమెను హత్యచేసిన వారిని ఇప్పటి వరకు పట్టుకోలేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని విమర్శించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీపైనా విమర్శలు గుప్పించారు. ఆయన తనకంటే పెద్ద నటుడని అన్నారు. గౌరీ లంకేశ్ హత్యపై మోదీ మౌనానికి నిరసనగా తాను అందుకున్న జాతీయ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తానని సంచలన ప్రకటన చేశారు. అయితే ఆ వ్యాఖ్యలను ప్రకాశ్ రాజ్ మంగళవారం తోసిపుచ్చారు. తనకొచ్చిన అవార్డులను వెనక్కి ఇచ్చేంత మూర్ఖుడిని కాదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.