Nayan mongia: కోహ్లీ-ధోనీ మధ్య కెమిస్ట్రీ సూపర్: నయన్ మోంగియా
- ధోనీ జట్టులో ఉంటే కోహ్లీకే లాభం
- ధోనీ ఆటకు వయసు అడ్డంకి కాదు
- వచ్చే ప్రపంచకప్ జట్టులో ధోనీకి స్థానం
మహేంద్రసింగ్ ధోనీ నుంచి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నప్పటి నుంచి కోహ్లీ-ధోనీ మధ్య కెమిస్ట్రీ బ్రహ్మాండంగా కుదిరిందని టీమిండియా మాజీ కీపర్ నయన్ మోంగియా అన్నాడు. ధోనీ నుంచి సలహాలు, సూచనలు అందుకుంటూ కోహ్లీ మరింతగా రాటుదేలుతున్నాడని ప్రశంసించాడు. ధోనీ సేవలు జట్టుకు ఎంతో అవసరమని పేర్కొన్న మోంగియా ఆయన గొప్ప ఫినిషరే కాకుండా మ్యాచ్ విన్నర్ కూడా అని కితాబిచ్చాడు.
ధోనీ ఆటకు, వయసుకు సంబంధం లేదని, ధోనీ విషయంలో వయసు ఒక అంకె మాత్రమేనని పేర్కొన్నాడు. ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ధోనీ ఆటగాళ్లకు సలహాలు ఇస్తూ కనిపించాడని అన్నాడు. 2019 ప్రపంచకప్ జట్టులో ధోనీ తప్పకుండా ఉంటాడని, ఇందులో ఎవరికీ సందేహం అవసరం లేదని పేర్కొన్నాడు. ధోనీ జట్టులో ఉండడం వల్ల కోహ్లీకే లాభమని పేర్కొన్న మోంగియా.. ధోనీ ఫిట్నెస్ను, ఫామ్‌ను కొనసాగిస్తే అతడికి కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి నుంచి పూర్తి మద్దతు ఉంటుందని అభిప్రాయపడ్డాడు.