geetha vishnu: గంజాయి రవాణా కేసులో టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులు మనవడు విష్ణు అరెస్ట్
- దాదాపు రెండు నెలలుగా పరారీలో
- హైదరాబాద్ డ్రగ్స్ కేసుతోనూ విష్ణుకు సంబంధాలు
- కెల్విన్, రవితేజతో దగ్గరి పరిచయం
గంజాయి రవాణా కేసులో టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడి మనవడు గీతా విష్ణును బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి రవాణాలో పలువురు ప్రముఖులతో సంబంధాలు ఉన్న గీతావిష్ణు దాదాపు రెండు నెలలుగా పరారీలో ఉన్నాడు. బుధవారం జయనగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. గంజాయి రవాణాలో ప్రముఖులతో సంబంధాలు ఉండడంతో విచారణ కోసం తమకు 15 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు.
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసుతోనూ గీతావిష్ణుకు సంబంధాలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రగ్స్ కేసు సూత్రధారి అయిన కెల్విన్, నటుడు రవితేజతోనూ అతడికి సంబంధాలు ఉన్నట్టు చెబుతున్నారు. ప్రముఖ సినీ నటుడు దేవరాజ్ కుమారులు ప్రజ్వల్, ప్రణవ్లకు కూడా గంజాయి రవాణా కేసుతో సంబంధం ఉందని, వారితోనూ విష్ణుకు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
గతనెల 27న అర్ధరాత్రి విష్ణు బెంజ్ కారులో వెళ్తూ మరో కారును ఢీకొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే విష్ణు పరారయ్యాడు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడగా విష్ణు కారు నుంచి పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.