Rahul Gandhi: రాహుల్ గాంధీతో పోటీ పడి అధ్యక్ష పీఠాన్ని అధిష్టించండి.. పార్టీ నేతలకు కాంగ్రెస్ బంపరాఫర్!
- కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువన్న ఏఐసీసీ
- రాహుల్‌తో పోటీపడేవారిని ఆహ్వానిస్తున్నట్టు వెల్లడి
- చరిత్రను గుర్తు చేసిన రణ్‌దీప్ సూర్జేవాలా
కాంగ్రెస్ చీఫ్‌గా రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి సర్వం సిద్ధమైన వేళ కాంగ్రెస్ మరో ప్రకటన చేసింది. కాంగ్రెస్ అధ్యక్ష పీఠం కోసం రాహుల్ గాంధీతో ఎవరైనా పోటీ పడొచ్చని ప్రకటించింది. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని, అధ్యక్ష పదవి కోసం ఎవరైనా పోటీ పడవచ్చని తెలిపింది. పోటీపడేవారిని ఆహ్వానిస్తున్నట్టు పేర్కొంది.
కాంగ్రెస్‌లో అధ్యక్ష స్థానానికి పోటీ పడడం ఇదే కొత్త కాదని ఏఐసీసీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా పేర్కొన్నారు. గతంలో సోనియా గాంధీతో జితేంద్ర ప్రసాద్ పోటీ పడ్డారని గుర్తు చేశారు. ఇప్పుడు రాహుల్‌తో ఎవరైనా పోటీ పడొచ్చని అన్నారు. ప్రజాస్వామ్య సవాళ్ల నుంచి కాంగ్రెస్ ఎప్పుడూ పారిపోలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో ఇందిరా గాంధీ ముందున్నారని తెలిపారు. అప్పట్లో మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్ కూడా ఒకరిపై ఒకరు పోటీకి దిగారని వివరించారు.
ఇందిరాగాంధీ, సోనియాగాంధీలు చాలాసార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, మరికొన్ని సార్లు పోటీ ఎదుర్కొన్నారని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం మాత్రం అందరి చాయిస్ రాహుల్ గాంధీయేనని సూర్జేవాలా పేర్కొన్నారు. అధ్యక్ష పదవిని ఆశించేవారు పోటీ పడవచ్చని, వారిని ఆహ్వానిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.