padyak: పెడ్డాక్ పుణ్యమాని గన్ షాపుల్లో హాట్ కేక్ గా మారిన 'బంప్ స్టాక్'!
- సెమీ ఆటోమేటిక్ రైఫిల్ ను మెషీన్ గన్ గా మార్చే 'బంప్ స్టాక్'
- భారీ ఎత్తున వస్తున్న ఆర్డర్లు - స్టాక్స్ ఖాళీ
- తమ ఆన్ లైన్ జాబితా నుంచి తొలగించిన వాల్ మార్ట్
- విక్రయాలు నిలిపివేయాలని యూఎస్ కాంగ్రెస్ లో బిల్లు
బంప్ స్టాక్... ట్రిగ్గర్ నొక్కితేగాని బులెట్ బయటకు వెళ్లని సెమీ ఆటోమేటిక్ రైఫిల్ ను ఒక్క నిమిషంలో వందలాది బులెట్లు దూసుకెళ్లేలా చేయగల ఓ పరికరం. జార్జియాలోని గైనెస్ విల్లీ ప్రాంతంలోని జార్జియా గన్ స్టోర్ లో గత ఏడాది కాలంగా బంప్ స్టాక్ కోసం ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. ఆదివారం నాటి లాస్ వెగాస్ ఘటన, 'బంప్ స్టాక్'ను వాడి తన రైఫిల్ ను ఆటోమేటిక్ చేసిన స్టీఫెన్ పెడ్డాక్ ఆలోచన తరువాత ఇప్పుడు 'బంప్ స్టాక్' హాట్ కేక్ గా మారింది.
గన్ స్టోర్లకు వస్తున్న కస్టమర్లు వీటిని ఎక్కువగా విచారించి, ఆర్డర్లు ఇస్తున్నారని జార్జియా గన్ స్టోర్ యజమాని కెల్లీ వీక్స్ వెల్లడించారు. ఎంతో మంది 'బంప్ స్టాక్' డిస్ట్రిబ్యూటర్లు తమ వద్ద స్టాక్ లేదని చెబుతున్నారని ఆయన తెలిపారు. తన వద్ద ఉన్న 12 రైఫిళ్లకు 'బంప్ స్టాక్స్' అమర్చి వాటంతట అవే పేలేలా చేసి పెడ్డాక్ మారణహోమాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తరువాత అమెరికాలో తుపాకుల విక్రయాల నిబంధనలను మరింత కఠినం చేయాలన్న డిమాండ్ ఊపందుకోగా, కొత్త రూల్స్ వచ్చే ముందే ఈ తరహా యాక్సెసరీస్ కొనుగోలు చేయాలని ఎంతో మంది భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక ఆదివారం నాటి మారణహోమం తరువాత గన్ కంపెనీల ఈక్విటీ వాటాల విలువ భారీగా పెరిగింది. డెమోక్రటిక్ సెనెటర్ డేనీ ఫినెస్టియన్, బుధవారం నాడు 'బంప్ స్టాక్స్' విక్రయాలను నిలిపివేయాలని ఓ బిల్లును ప్రవేశపెట్టారు. తుపాకులను మెషీన్ గన్స్ గా మార్చే ఆలోచన ప్రజలకు వస్తే మరిన్ని దాడులు జరుగుతాయని, వెంటనే ప్రభుత్వం కల్పించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఇక 'బంప్ స్టాక్' కోసం ఆన్ లైన్ స్టోర్లకు భారీ ఎత్తున ఆర్డర్లు వస్తుండగా, ముందు జాగ్రత్త చర్యగా, వాటిని తమ జాబితా నుంచి తొలగించినట్టు వాల్ మార్ట్ తెలిపింది. 1986 నుంచి అమెరికాలో మెషీన్ గన్స్ వంటి ఫుల్లీ ఆటోమేటిక్ ఆయుధాలపై అమెరికాలో నిషేదం అమలులో ఉంది. ఒకసారి నొక్కితే ఒక్క బులెట్ ను వదిలే సెమీ ఆటోమేటిక్ రైఫిల్స్ అమెరికాలో అత్యధికంగా అమ్ముడవుతుంటాయి. కాగా, ఓ ఆన్ లైన్ వీడియోలో ఏడు సెకన్లలో 100 రౌండ్లు కాల్పులు జరుపుతున్న 'బంప్ స్టాక్' అమర్చిన సెమీ ఆటోమేటిక్ రైఫిల్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.