sehwag: సచిన్ తనకు ఇచ్చిన సలహానే కోహ్లీకి ఇచ్చిన సెహ్వాగ్!
- సింగిల్స్ కోసం ప్రయత్నించి వికెట్ పారేసుకోవద్దు
- బౌండరీలపై దృష్టిని సారిస్తే జట్టుకు మేలు
- కోహ్లీకి సలహా ఇచ్చిన వీరేంద్ర సెహ్వాగ్
ఇటీవలి ఆస్ట్రేలియా సిరీస్ లో భారీగా పరుగులు రాబట్టడంలో విఫలమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటతీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసిన మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనకు ఇచ్చిన ఓ సలహాను గుర్తు చేశాడు. ఈ సిరీస్ లో ఐదు మ్యాచ్ లు ఆడిన కోహ్లీ, వరుసగా 0, 92, 28, 21, 39 పరుగులు మాత్రమే చేసిన సంగతి తెలిసిందే.
ఎంతో మంది యువ క్రికెటర్లకు ఆదర్శంగా నిలుస్తున్న కోహ్లీ, ఐదు మ్యాచ్ లలో 180 పరుగులు మాత్రమే చేయడం, లేని పరుగులకు, సింగిల్స్ తీయడానికి ప్రయత్నించి వికెట్ సమర్పించుకోవడం సరికాదని సెహ్వాగ్ 'ఇండియా టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈడెన్ గార్డెన్స్ లో 92 పరుగుల వద్ద ఉన్న కోహ్లీ, సెంచరీ సాధించి ఉంటే బాగుండేదని తెలిపాడు.
కోహ్లీ ఎక్కువగా థర్డ్ మ్యాన్ వైపు బంతిని పంపుతూ సింగిల్స్ తీసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాడని గుర్తు చేస్తూ, గతంలో తాను కూడా అలాగే చేస్తున్నప్పుడు సచిన్ ఇచ్చిన సలహాను గుర్తు చేసుకున్నాడు. కేవలం ఒక్క సింగిల్ పరుగు కోసం ఆడాలని చూడవద్దని, ఒక్క పరుగు కోసం విలువైన వికెట్ ను సమర్పించుకుంటే, జట్టు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని, సింగిల్ కు బదులుగా బౌండరీలపై దృష్టిని పెట్టాలని సచిన్ తనకు చెప్పాడని, ఇప్పుడు అదే సలహాను తాను కోహ్లీకి ఇస్తున్నానని అన్నాడు.