south dawood: కంబోడియాలో ఆత్మహత్య చేసుకున్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ శ్రీధర్ ధనపాలన్
- సైనైడ్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్న గ్యాంగ్ స్టర్
- తమిళనాడు పోలీసులకు మోస్ట్ వాంటెడ్
- 7 హత్య కేసులు సహా 43 కేసులు విచారణ దశలో
- స్వగ్రామం కాంచీపురంలో ఉద్రిక్తత
'సౌతిండియా దావూద్'గా పాప్యులర్ అయిన గ్యాంగ్ స్టర్ శ్రీధర్ ధనపాలన్ (44) కంబోడియాలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఉదయం ఆయన సైనైడ్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. శ్రీధర్ సైనైడ్ తీసుకున్నట్టు తెలుసుకున్న ఇరుగు, పొరుగువారు వెంటనే సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన ప్రాణాలు పోయినట్టు వైద్యులు ప్రకటించారు. కుటుంబ కలహాల కారణంగానే శ్రీధర్ ధనపాలన్ ఈ పనికి పాల్పడ్డట్టు తెలుస్తోంది.
కాగా, తమిళనాడు పోలీసులకు శ్రీధర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఎన్నో కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నాడు. శ్రీధర్ ధనపాలన్ మరణ వార్త తెలిసిన తరువాత, ఆయన ఇల్లు ఉన్న కాంచీపురంలోని ఎల్లియప్పన్ వీధిలో ఉద్రిక్తత నెలకొంది. శ్రీధర్ పై ఏడు హత్య కేసులు సహా మొత్తం 43 కేసులు పెండింగ్ లో ఉన్నాయి.
2013లో శ్రీధర్ ఇండియా నుంచి పారిపోగా, ఇప్పటివరకూ అతని జాడను కనిపెట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. కంబోడియాలో ఆయన ఒంటరిగానే ఉంటున్నట్టు తెలుస్తోంది. ఆయన భార్యా, ఇద్దరు కుమారులు కాంచీపురంలోనే ఉండగా, కుమారుడు లండన్ లో విద్యాభ్యాసం చేస్తున్నాడు.