SBI: కంపెనీలకు బదులు సామాన్యులకు మరిన్ని రుణాలు: ఎస్బీఐ కాబోయే చైర్మన్ రజనీష్

  • రేపు బాధ్యతలు చేపట్టనున్న రజనీష్ కుమార్
  • కార్పొరేట్ క్రెడిట్ గ్రోత్ తగ్గుతోందని వ్యాఖ్య
  • ఆర్థిక వ్యవస్థకు బ్యాంకింగ్ వ్యవస్థే మూలం
  • నిరర్థక ఆస్తుల మొత్తాన్ని తగ్గించేందుకు కృషి చేస్తాం

ఇండియాలోని అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు శుక్రవారం నాడు చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న రజనీష్ కుమార్, తమ బ్యాంకు సామాన్యులకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఈ ఉదయం ఓ సదస్సులో పాల్గొని ప్రసంగించిన ఆయన, కార్పొరేట్ క్రెడిట్ గ్రోత్ తగ్గుతోందని, కన్స్యూమర్ లోన్స్ గణనీయంగా పెరుగుతున్నాయని తెలిపారు. కంపెనీలకు బదులు వ్యక్తిగత ఖాతాదారులకు మరిన్ని రుణాలు ఇస్తామని తెలిపారు.

భారత ఆర్థిక వ్యవస్థ మరో మెట్టు ఎక్కుతున్న తరుణంలో బ్యాంకింగ్ పరిశ్రమ పాత్ర అత్యంత కీలకమని, ఎదురవుతున్న సవాళ్లను అధిగమించే సత్తా ఉందని పేర్కొన్నారు. వచ్చే మూడేళ్లలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్తిగా రూపాంతరం చెందుతుందని రజనీష్ అన్నారు. పెరుగుతున్న నిరర్థక ఆస్తుల శాతాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మౌలిక రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, దేశాభివృద్ధి కోసం ఇన్ ఫ్రా కంపెనీలకు అండగా నిలుస్తామని తెలిపారు. కాగా, అరుంధతీ భట్టాచార్య నాలుగేళ్ల పదవీ కాలం రేపటితో ముగియనున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం 59 ఏళ్ల వయసులో ఉన్న రజనీష్, ఎస్బీఐ నలుగురు ఎండీలలో ఒకరన్న సంగతి తెలిసిందే. 1980లో ఆయన ఎస్బీఐలో చేరగా, నియామకాల క్యాబినెట్ కమిటీ, అక్టోబర్ 7 నుంచి మూడేళ్ల కాలపరిమితికి రజనీష్ ను బ్యాంకు చైర్మన్ గా నియమించింది. ఈ మేరకు నిన్న డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News