gandhi: మహాత్మా గాంధీని గాడ్సే ఒక్కడే చంపలేదా?... ఆయన హత్య వెనుక ఇంకొకరు ఉన్నారా?
- గాంధీ శరీరంలో నాలుగు బుల్లెట్లు
- మూడు బుల్లెట్లు కాల్చిన గాడ్సే
- గాంధీ శరీరంలోని నాలుగో బుల్లెట్ ఎవరు కాల్చారు?
భారత దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టిన మహాత్మా గాంధీని గాడ్సే పొట్టనబెట్టుకున్న సంగతి విదితమే. కేసు విచారణ జరిగి, కోర్టు తీర్పు ప్రకారం గాడ్సేని ఉరితీసినప్పటికీ, ఇంకా ఈ హత్యపై ఇప్పటికీ పలు అనుమానాలు తలెత్తుతూనే వున్నాయి. గాడ్సే గాంధీని మూడు బుల్లెట్లతో కాల్చాడని పోలీసులు తేల్చారు.
అయితే, గాంధీకి నాలుగు బుల్లెట్లు తగిలాయని, నాలుగో బుల్లెట్ ఆయన శరీరంలోంచి దూసుకుపోవడం వల్లే మరణించారని అప్పట్లో అంతర్జాతీయంగా మీడియాలో ప్రచారం జరిగింది. మరి, ఆ నాలుగో బుల్లెట్ ను ఎవరు కాల్చారు? ఈ హత్య కుట్రలో గాడ్సే కాకుండా మరో వ్యక్తి వున్నాడా? వుంటే ఎవరు? అన్న వివాదం అప్పటి నుంచి కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో 'ఆధునిక అభినవ భారత్' వ్యవస్థాపకుడు డాక్టర్ పంకజ్ ఫడ్నీస్ సుప్రీంకోర్టులో ఒక పిల్ దాఖలు చేశారు. అందులో గాడ్సే కాల్చిన మూడు బుల్లెట్ల వల్ల గాంధీ చనిపోలేదని, నాలుగో బుల్లెట్ వల్లే ఆయన మరణించాడని పేర్కొన్నారు.
అందుకే మహాత్ముడి హత్యకేసును రీ ఓపెన్ చేసి విచారణ చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. గాంధీకి నాలుగు బుల్లెట్లు తగిలాయని అప్పట్లో ప్రపంచంలోని అన్ని వార్తా పత్రికల్లో వచ్చిందని ఆయన గుర్తు చేశారు. అయితే ఆ నాలుగో బుల్లెట్ ఎక్కిడి నుంచి వచ్చింది? దాన్ని ఎవరు పేల్చారు? అన్న అంశాన్ని అప్పటి పోలీసులు పక్కన పెట్టారని ఆయన తెలిపారు. ఈ పిటిషన్ నేడు విచారణకు రానుంది.
ఈ చిక్కంతా గాంధీని హత్య చేసేందుకు ఉపయోగించిన ఆయుధం వల్లే తలెత్తిందని చెబుతూ తాజాగా ఒక ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. అందులో గాంధీజీ హత్యకు గాడ్సే ఉపయోగించిన 'బెరెట్టా' (రిజిస్టర్డ్ నంబర్ 068240) పిస్టల్ గ్వాలియర్ కు చెందిన డాక్టర్ దత్తాత్రేయ పర్చూరేకి సంబంధించినదన్న ఆరోపణలున్నాయి. కానీ వాస్తవానికి ఆయన వద్ద రెండు బెరెట్టా పిస్టల్స్ (నంబర్ 719791) ఉన్నాయి. ఇదే రిజిస్టర్ నంబర్ తో గ్వాలియర్ కే చెందిన ఉదయ్ చాంద్ అనే వ్యక్తి వద్ద కూడా మరో బెరెట్టా పిస్టల్ ఉందని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లలో 1948 నాటి గ్వాలియర్ ఎస్పీ కూడా సంతకం చేశారని తెలిపింది. ఈ నేపథ్యంలో గాంధీని గాడ్సే ఒక్కడే చంపాడా? లేక గాంధీని ఇద్దరు చంపారా? మరి ఆ నాలుగో బుల్లెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? అన్నదానిని విచారించాలని కోరారు.
ఈ విషయంలో సదరు ఆంగ్ల పత్రిక డాక్టర్ పర్చూరే తనయుడు ఉపేంద్రని, మనవడు మేగదూత్ ని సంప్రదించగా స్పందించడానికి వారు నిరాకరించారట.