Kulbhushan Jadhav: కుల్‌భూషణ్ మరణశిక్ష విషయంలో నిర్ణయం తీసుకునే సమయం దగ్గర పడింది: పాక్ ఆర్మీ
- అంతర్జాతీయ న్యాయస్థానం స్టేతో ఆగిన మరణశిక్ష
- క్షమాభిక్ష పిటిషన్ ఆర్మీ చీఫ్‌కు చేరిక
- త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తామని ప్రకటన
- క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకునేంత వరకు శిక్షను అమలు చేయబోమన్న పాక్
గూఢచర్యం ఆరోపణలతో పాక్ చెరలో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ క్షమాభిక్ష పిటిషన్ విషయంలో త్వరలోనే నిర్ణయం వెలువడనుందని పాక్ ఆర్మీ తెలిపింది. గూఢచర్యం ఆరోపణలపై కుల్‌భూషణ్‌కు పాక్ ఆర్మీ కోర్టు మరణశిక్ష విధించింది. 46 ఏళ్ల జాదవ్‌కు పాకిస్థాన్ ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్ ఏప్రిల్‌లో మరణశిక్ష విధించింది.
కుల్‌భూషణ్ జాదవ్ క్షమాభిక్ష పిటిషన్ ఆర్మీ చీఫ్‌కు అందిందని ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ తెలిపారు. త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉందని, ఏ నిర్ణయం తీసుకునేది త్వరలోనే తెలియపరుస్తామని ఆయన పేర్కొన్నారు.
తనకు విధించిన మరణశిక్షపై జాదవ్ పెట్టుకున్న పిటిషన్‌ను అప్పిలేట్ కోర్టు కొట్టివేయడంతో ఆయన పాక్ ఆర్మీ చీఫ్‌ను ఆశ్రయించారు. అక్కడి చట్టాల ప్రకారం చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీఓఏఎస్)కు క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయన కూడా దానిని కొట్టివేస్తే పాక్ అధ్యక్షుడిని ఆశ్రయించవచ్చు.
కాగా, జాదవ్‌ను ఇరాన్ నుంచి కిడ్నాప్ చేసి అతడిపై గూఢచర్యం ఆరోపణలు మోపారని భారత్ ఆరోపిస్తోంది. జాదవ్‌కు పాక్ విధించిన మరణశిక్షను ఆపాలంటూ భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మే 18న విచారించిన 10 మంది సభ్యుల ఐసీజే ధర్మాసనం జాదవ్ మరణశిక్షపై స్టే విధించింది. జాదవ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకునేంత వరకు ఆయనకు మరణశిక్ష అమలు చేయబోమని పాక్ స్పష్టం చేసింది.