Kannada: హత్యకు గురైన జర్నలిస్టు గౌరీ లంకేశ్కు ప్రతిష్ఠాత్మక గ్లోబల్ అవార్డు!
- ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైన తొలి భారత జర్నలిస్ట్
- ప్రజాపోరాటానికి దక్కిన గౌరవమన్న లంకేశ్ సోదరి
- పాకిస్థాన్ శాంతి కార్యకర్తతో కలిసి అవార్డును పంచుకోనున్న లంకేశ్
ఇటీవల హత్యకు గురైన కన్నడ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ ప్రతిష్ఠాత్మక గ్లోబల్ అవార్డుకు ఎంపికయ్యారు. హత్యకు గురైన రష్యాకు చెందిన ప్రముఖ రిపోర్టర్, రాజకీయ కార్యకర్త పేరు మీద ఇస్తున్న అవార్డుకు గౌరీ లంకేశ్ ఎంపికయ్యారు. రీచ్ ఆల్ విమెన్ ఇన్ వార్ (రా ఇన్ వార్) అన్నా పొలిట్కోవస్కాయా అవార్డును హత్యా బెదిరింపులు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ శాంతి కార్యకర్త గులాలై ఇస్మాయిల్ (31)తో కలిసి గౌరీ లంకేశ్ (55)కు ప్రకటించారు.
ప్రజల కోసం పోరాడే వారికి ఈ అవార్డు నైతికంగా మద్దతు ఇస్తుందని లంకేశ్ సోదరి కవిత తెలిపారు. ఈ అవార్డు గౌరీకి దక్కినది కాదని, గౌరీ వెనక నిలబడిన అందరిదని ఆమె పేర్కొన్నారు. కాగా ఈ అవార్డు దక్కిన తొలి భారతీయురాలు లంకేశే కావడం గమనార్హం.