kim jong un: ఉత్తర కొరియాపై అమెరికాకు వచ్చిన కొత్త అనుమానమిది!
- సొంతంగా రాకెట్ల ఇంధన తయారీ
- గతంలో అందించిన చైనా, రష్యా
- మరిన్ని ఆంక్షలు విధించే యోచనలో ట్రంప్ సర్కారు
తరచూ అణ్వస్త్ర పరీక్షలు చేస్తూ, తమతో కయ్యానికి కాలు దువ్వుతున్న ఉత్తర కొరియాపై అమెరికాకు కొత్త అనుమానాలు తలెత్తాయి. అసలు రాకెట్ల పరీక్షలకు కావాల్సిన ఇంధనాన్ని నార్త్ కొరియా ఎక్కడి నుంచి తెస్తోందన్నదే వారి అనుమానం. మొదట్లో చైనా లేదా రష్యా నుంచి యూడీఎంహెచ్ (అన్ సిమిట్రికల్ డైమిథైల్ హైడ్రోజన్)ని తెచ్చుకుని ఉండవచ్చని, ఇప్పుడు మాత్రం కొరియానే స్వయంగా సదరు ఇంధనాన్ని తయారు చేసుకుంటూ ఉండవచ్చని సీఐఏ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఆంక్షలు విధించక ముందు రహస్యంగా చైనా, రష్యాలు ఈ ఇంధనాన్ని ఇచ్చేవని, ఇప్పుడు సొంతంగా రాకెట్ ఇంధనాన్ని తయారు చేసుకునే స్థాయికి కిమ్ ప్రభుత్వం చేరుకుందని 'న్యూయార్క్ టైమ్స్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ ఇంధనాన్ని తయారు చేసే పరికరాలను ఇప్పటికీ రష్యా, చైనాలు అందిస్తున్నాయని కూడా ఈ కథనం ఆరోపించింది.
ఈ విషయాన్ని ఇంకా తేల్చలేదని, అదే నిజమైతే చైనా, రష్యాలను నిలువరించేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలన్న విషయమై భద్రతా సంస్థలు యోచిస్తున్నాయని పేర్కొంది. ఇక రాకెట్ ఇంధనం గురించి, ఉత్తర కొరియాలో యూడీఎంహెచ్ తయారీ ప్లాంట్ల గురించి నిఘా సంస్థలు ప్రభుత్వానికి గతంలోనే సమాచారాన్ని అందించినా పెడచెవిన పెట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. జార్జ్ బుష్ పాలిస్తున్న సమయంలోనే కొన్ని రహస్య పత్రాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు సమాచారం.