aids: దేశంలో ఎయిడ్స్ బాధితులు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువట!
- చికిత్సలోనూ ముందంజ
- వెల్లడించిన ఎయిడ్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు
- నేటి నుంచి ఆసికాన్-2017 సదస్సు
భారత దేశ వ్యాప్తంగా ఎయిడ్స్ బాధితులు ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారని ఎయిడ్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డా. ఈశ్వర్ గిలాడ అన్నారు. ఆ తర్వాత స్థానాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఎయిడ్స్ తీవ్రత అధికంగా ఉందని తెలిపారు. అంతేకాకుండా ఎయిడ్స్ పరిష్కారంలోనూ తెలుగు రాష్ట్రాలే ముందంజలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ఎయిడ్స్ చికిత్సకు అవసరమైన మందుల్లో 92 శాతం భారతదేశమే సరఫరా చేస్తోందని, మందులు సరఫరా చేసే ఆరు ముఖ్యసంస్థల్లో మూడు హైద్రాబాద్‌లోనే ఉన్నాయని ఆయన అన్నారు. ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నిర్వహిస్తున్న `ఆసికాన్ -2017` ఈ రోజు ప్రారంభం అవుతోంది. మూడు రోజుల పాటు హైద్రాబాద్‌లో ఈ సదస్సు జరుగుతుంది. ఎయిడ్స్ నియంత్రణకు, నిర్మూలనకు చేపట్టాల్సిన కార్యక్రమాలను, చర్యలను ఈ సదస్సులో చర్చించనున్నారు. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల మేరకు 2030లోగా ప్రపంచం నుంచి ఎయిడ్స్‌ను పారద్రోలేందుకు కృషిచేయాలని ఈశ్వర్ తెలియజేశారు.