india: ఇండియాకు వెళ్లేవారు జాగ్రత్త: పౌరులను హెచ్చరించిన చైనా
- సరిహద్దుల్లో ఫోటోలు తీయవద్దు
- ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి
- సమస్య వస్తే ఎంబసీని సంప్రదించండి
- చైనీయులకు తాజా హెచ్చరికలు
భారత్ లో ఉన్న తమ దేశ పౌరులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చైనా కోరింది. ఇండియాకు వెళ్లేవారు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలంటూ శుక్రవారం నాడు కొన్ని సలహాలతో కూడిన ప్రకటన విడుదల చేసింది. "భారత సరిహద్దులను, ముఖ్యంగా సైనికుల కార్యకలాపాలను, వాహనాలను ఫోటోలు తీయవద్దు. నేపాల్, భారత్ సరిహద్దులకు దగ్గరగా ఉన్న చైనీయులు సరిహద్దుల్లోని మార్కెట్లకు వెళ్లరాదు. పొరపాటున కూడా ఇతర దేశ సరిహద్దులను దాటవద్దు" అని సూచించింది.
కాగా, డోక్లామ్ లో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఏర్పడిన తరువాత తొలిసారిగా ప్రయాణ సలహాలు చెప్పిన చైనా, ఇప్పుడు మరోసారి అదే పని చేసింది. "అండమాన్ నికోబార్ ద్వీపాలకు వెళ్లిన కొందరు చైనా పౌరసులను అరెస్ట్ చేశారు. మరికొందరిని కాలు మోపగానే వెనక్కు వెళ్లిపోవాలని ఆదేశించారు. ఇండియాలో ఉన్న చైనాకు చెందిన ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి" అని కూడా ఈ ట్రావెల్ అడ్వయిజరీలో ఉందని ప్రభుత్వ రంగ 'గ్లోబల్ టైమ్స్' ప్రకటించింది.
న్యూఢిల్లీలో ఉన్న చైనా ఎంబసీ ఈ హెచ్చరికలను జారీ చేసిందని తెలిపింది. అనవసరంగా ఇండియాకు ప్రయాణాలు పెట్టుకోవద్దని కూడా సూచించినట్టు వెల్లడించింది. అత్యవసరమైన పనులుంటే అన్ని అనుమతులూ పొంది రావాలని, ఏమైనా సమస్యలు వస్తే ఎంబసీని సంప్రదించాలని కోరింది.