srisailam: నిండుకుండలా శ్రీశైలం... నేడో, రేపో గేట్ల ఎత్తివేత!
- మూడున్నర అడుగులు నిండితే చాలు
- ఎగువన వర్షాలతో కొనసాగుతున్న వరద
- పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి
- శ్రీశైలం నిండితే, సాగర్ కు నీరు
ఎగువన కురుస్తున్న వర్షాల పుణ్యమాని శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. జూరాల నుంచి 50 వేల క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 5,200 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో, విద్యుత్ ఉత్పత్తి ద్వారా సుమారు 16 వేల క్యూసెక్కులను మాత్రమే వదులుతున్నారు. మొత్తం 215 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యమున్న ప్రాజెక్టులో ప్రస్తుతం 198 టీఎంసీలకు నీరు చేరింది. రోజుకు ఏడు టీఎంసీలకు పైగానే నీరు వస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో నేడు కూడా వర్షాలు కురవడంతో కనీసం మరో నాలుగైదు రోజులు వరద కొనసాగుతుందని అంచనా వేస్తున్న అధికారులు, నేడో, రేపో ప్రాజెక్టు గేట్లను ఎత్తేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండాలంటే, కేవలం 3.5 అడుగుల మేరకు నీటి మట్టం పెరిగితే సరిపోతుందని ప్రాజెక్టు ఎస్ఈ మల్లికార్జునరెడ్డి వెల్లడించారు. ఆపై వచ్చే వరద ప్రవాహాన్ని బట్టి ఎన్ని గేట్లను ఎత్తి సాగర్ కు నీటిని విడుదల చేయాలన్న విషయాన్ని నిర్ణయిస్తామని అన్నారు. శ్రీశైలం నిండటంతో ఎత్తి పోతల పథకాలు, కుడి, ఎడమ కాలువల కింద ఉన్న రైతాంగం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్ లో కనీసం ఒక్క పంటకన్నా నీరందుతుందని భావిస్తున్నారు.