charpai: నులక మంచం ఖరీదు రూ. 50 వేలు... మేడిన్ ఆస్ట్రేలియా మరి!
- భారత్ నుంచి స్ఫూర్తి
- వ్యాపారం చేస్తున్న విదేశీయుడు
- ఎగబడి కొంటున్న ఆస్ట్రేలియన్లు
భారతీయులంతా పాశ్చాత్య ధోరణి వెంటపడుతుంటే, పాశ్చాత్యులు భారత సంప్రదాయాలపై ఆసక్తి చూపిస్తున్నారనడానికి మరో సాక్ష్యం దొరికింది. ఒకప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్లలో కనిపించే నులక మంచాన్ని ఇప్పుడు ఆస్ట్రేలియన్లు రూ. 50 వేలు పెట్టి కొనేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు.
సిడ్నీకి చెందిన డేనియల్ బ్లూర్ 2010లో భారతదేశానికి వచ్చినపుడు ఇక్కడ నులక మంచాన్ని చూశాడు. దాని స్ఫూర్తితో వాళ్ల దేశం వెళ్లాక ప్రత్యేకంగా కలప, తాడు ఉపయోగించి వాటిని తయారుచేసి, వాటిని అమ్మడం ప్రారంభించాడు. వీటిని కొనడానికి ఆస్ట్రేలియన్లు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారని డేనియల్ తెలిపాడు. ఇటీవల తాను తయారు చేసిన మంచాలకు సంబంధించిన ప్రకటన పోస్టర్లను డేనియల్ సిడ్నీలోని స్టోర్ల వద్ద అంటించాడు.
ఆ ప్రకటన చూసిన ఓ భారతీయుడు దాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇప్పుడు ఆ ఫొటో వైరల్గా మారింది. ఆ ప్రకటనలో నులక మంచం ఖరీదు 990 ఆస్ట్రేలియన్ డాలర్లుగా డేనియల్ పేర్కొన్నాడు. అంటే దాదాపు రూ. 50 వేలు. ఆ మంచం తయారీకి మాపుల్ చెట్టు కలప, మనీలా తాడు ఉపయోగించడం వల్ల అంత ధర నిర్ణయించాల్సి వచ్చిందని డేనియల్ చెప్పాడు. ఈ ప్రకటన ట్విట్టర్లో చూసిన భారతీయులు తమ సంస్కృతిని గుర్తు చేసినందుకు గర్వపడుతూ, డేనియల్కి కృతజ్ఞతలు చెబుతున్నారు.