reliance jio: దేశంలో అతిపెద్ద 4జీ నెట్వర్క్ జియో: ఓపెన్ సిగ్నల్ సర్వే
- ఉత్తమ 4జీ వేగం - ఎయిర్టెల్
- తర్వాతి స్థానాల్లో వొడాఫోన్, ఐడియా
- డేటా వినియోగం తగ్గించిన జియో వినియోగదారులు
దేశంలో వివిధ టెలికాం సంస్థల సేవలను అంచనా వేస్తూ వైర్లెస్ కవరేజ్ మ్యాపింగ్ కంపెనీ ఓపెన్ సిగ్నల్ తాజాగా నివేదిక రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం అతిపెద్ద 4జీ నెట్వర్క్గా రిలయన్స్ జియో సంస్థ నిలిచింది. కానీ 4జీ వేగం అందించడంలో మాత్రం నాలుగో స్థానంలో నిలిచింది. ఉత్తమ 4జీ వేగం అందిస్తున్న నెట్వర్క్లుగా ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఎయిర్టెల్ 9.15 ఎంబీపీఎస్ డౌన్లోడ్ వేగం అందిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
అలాగే, మొత్తంమీద డౌన్లోడ్ వేగాల వివరాలను కూడా నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం రిలయన్స్ జియో ఓవరాల్గా 5.81 ఎంబీపీఎస్ వేగాన్ని అందజేస్తూ మొదటి స్థానంలో నిలిచింది. 7 బిలియన్ల డేటా పాయింట్లను అధ్యయనం చేసి ఈ నివేదిక రూపొందించినట్లు ఓపెన్ సిగ్నల్ తెలిపింది. వారి అధ్యయనం ప్రకారం ఉచిత డేటా ఆఫర్ అందుబాటులో ఉన్నప్పటితో పోల్చితే ప్రస్తుతం జియో వినియోగదారుల డేటా వినియోగం చాలా తగ్గిందని వెల్లడించింది. అలాగే టెలికాం సంస్థలు తక్కువ రీఛార్జీకే ఎక్కువ డేటా అందిస్తుండటంతో ఇంటర్నెట్ ఉపయోగించే వినియోగదారుల సంఖ్య పెరిగి డేటా వేగం తగ్గిందని అంచనా వేసింది.