Aadhar: ఇక పోస్టాఫీసు ఖాతాలకు ఆధార్ లంకె.. తప్పనిసరి చేసిన ప్రభుత్వం
- ఖాతా తెరిచేందుకు ఆధార్ నంబరు తప్పనిసరి
- ఇప్పటికే ఉన్న వారికి డిసెంబరు 31 వరకు గడువు
- ఆధార్ లేనివారు ఎన్రోల్మెంట్ నంబరు ఇవ్వాలి
ఇప్పటికే పలు ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసిన ప్రభుత్వం ఇప్పుడు పోస్టాఫీసు ఖాతాలకు దానిని తప్పనిసరి చేసింది. ఇకపై తపాలా కార్యాలయంలో ఖాతా తెరవాలంటే ఆధార్ తప్పనిసరిగా చూపించాల్సిందే. అలాగే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీం, కిసాన్ వికాస్ పత్రాల కొనుగోలు చేసేందుకు కూడా ఆధార్ తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే ఖాతాలున్నవారు ఈ ఏడాది డిసెంబరు 31లోగా తమ ఆధార్ నంబరును పోస్టాఫీసులో సమర్పించాలని కోరింది.
ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నాలుగు వేర్వేరు గెజిట్ నోటిఫికేషన్లలో తెలిపింది. ఆధార్ నంబరు లేనివారు ఎన్రోల్మెంట్ నంబరును సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే పోస్టాఫీసులో ఖాతా ఉండి, ఆధార్ సమర్పించనివారు డిసెంబరు 31లోగా సమర్పించాలని గడువు విధించింది. నల్లధనాన్ని నివారించేందుకు పలు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం పలు ప్రభుత్వ పథకాలతోపాటు బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసింది. ఇటీవల మొబైల్ నంబర్లకు కూడా ఆధార్ లంకెను తప్పనిసరి చేసిన ప్రభుత్వం తాజాగా పోస్టాఫీసు ఖాతాలకూ దానిని విస్తరించింది.