america: అమెరికాకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్న చైనా.. ఉత్తర కొరియాకు మొండిచేయి చూపిస్తోంది: అంతర్జాతీయ మీడియా
- ఉత్తర కొరియా శరణార్థులను అడ్డుకుంటున్న చైనా
- సరిహద్దుల్లో చెక్ పోస్ట్ ల ఏర్పాటు
- కంచె ఏర్పాటు
- భారం తగ్గించుకోవడానికే అన్న చైనా
అమెరికాతో యుద్ధం జరిగితే ఉత్తరకొరియా చిత్తైపోతుందని చైనా నమ్ముతోందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఈ కారణంగానే ఎన్నో ఏళ్లుగా ఉత్తర కొరియాతో ఉన్న అనుబంధాన్ని కూడా కాదనుకుంటోందని తెలిపింది. ఉత్తర కొరియా శరణార్థులు తమ దేశంలోకి రాకుండా సరిహద్దుల్లో చెక్ పాయింట్లను ఏర్పాటు చేసిందని వెల్లడించింది. అంతేకాదు, సరిహద్దులో బలమైన కంచె ఏర్పాటును కూడా పూర్తి చేసిందని తెలిపింది. ఈ కంచెకు చైనా సైనికులు పహారా కాస్తున్నారని చెప్పింది. అమెరికా, కొరియాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తక ముందు ఈ కంచెకు సైనికులు కాపలా కాసేవారు కాదని తెలిపింది.
ప్రస్తుతం అమెరికాకు చైనా పూర్తిగా సహకరిస్తోందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇదే సమయంలో తననే నమ్ముకున్న ఉత్తర కొరియాకు మొండిచేయి చూపుతోందని తెలిపింది. అయితే, ఐక్యరాజ్యసమితి ఆంక్షల మేరకే తాము ఈ పని చేస్తున్నామని చైనా అంటోంది. కొరియా శరణార్థులకు తాము ఆశ్రయం ఇచ్చిన మాట వాస్తవమేనని... అయితే, అది గతం మాత్రమేనని చెప్పింది. అధిక జనాభాతో తాము సతమతమవుతున్నామని... అదనపు భారాన్ని తగ్గించుకునే క్రమంలోనే ఈ పని చేశామని తెలిపింది.