pawan kalyan: జనసేన శ్రేణులు, అభిమానులకు పవన్ కల్యాణ్ విన్నపం!
- మన దృష్టిని మరల్చడానికి విమర్శిస్తారు
- నన్ను వ్యక్తిగతం విమర్శించినా పట్టించుకోవద్దు
- మీ ఆవేశం పార్టీకి హాని కలిగించవచ్చు
2019 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బరిలోకి దిగాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఆయన దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన తాజగా ట్విట్టర్ వేదికగా ఓ విన్నపం చేశారు. అదేంటంటే...
"ప్రియమైన మీకు,
జనసేన శ్రేణులు, అభిమానులకు ఒక విన్నపం. ప్రస్తుతం మనం పార్టీ అంతర్గత నిర్మాణంలో తలమునకలయ్యాం. మరోవైపు, ప్రజాసమస్యలే పరమావధిగా ముందుకు సాగుతున్నాం. ఈ తరుణంలో కొంత మంది వ్యక్తులు మన దృష్టిని మరల్చడానికో, మనల్ని చికాకు పరచడానికో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటివాటిపై ఎవరూ స్పందించవద్దని కోరుతున్నా. నాపై వ్యక్తిగతంగా విమర్శలు చేసినా, నాకు చెడ్డ పేరు తీసుకొచ్చేలా మాట్లాడినా... అందరూ హుందాగా వ్యవహరించండి. ఎందుకంటే, ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు భిన్నంగా, బాధ్యతాయుతమైన రాజకీయ వ్యవస్థ ఏర్పాటు కోసం జనసేన ముందుకెళుతున్న సంగతి మీకు తెలిసిందే.
కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా రాజకీయాలు ఉండాలనేది జనసేన నమ్మకం. దీన్ని ఆచరణలో చూపాలన్న అభిమతంతోనే జనసేన ఆవిర్భవించింది. మానవత్వమే మతంగా, సమాజ హితమే అభిమతంగా జనసేన రూపుదిద్దుకుంటోంది. యువత, భావితరాలు, సమాజం, దేశ భవిష్యత్తుకు విశాలమైనటువంటి దృక్పథం కలిగిన రాజకీయాలు చాలా అవసరమని జనసేన నమ్ముతోంది. ఇలాంటి నేపథ్యంలో, మనపై వచ్చే విమర్శలకు మీరు ఆవేశానికి లోను కాకండి. మీ ఆవేశం పార్టీకి మేలు చేయకపోగా... ఒక్కోసారి హాని కూడా తలపెడుతుంది. మనపై చేస్తున్న ప్రతి విమర్శను కూడా పార్టీ లెక్కగడుతోంది. అవి హద్దులు మీరినప్పుడు పార్టీ స్పందిస్తుంది. మీరంతా పార్టీ కోసం హుందాగా పని చేయండి. మన ఓర్పే మన పార్టీకి రక్ష. జైహింద్".