big boss 11: బిగ్‌బాస్ కంటెస్టెంట్ జుబైర్ మా కుటుంబానికి చెందిన వాడు కాదు: దావూద్ కుటుంబం
- జుబైర్ ఒక మోసగాడు
- దావూద్ పేరును పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నాడు
- ఇలాగే కొనసాగితే కేసు పెడతాం
- హెచ్చరించిన దావూద్ కుటుంబీకులు
ఇటీవల హిందీలో ప్రారంభమైన `బిగ్‌బాస్ 11` ఇంట్లోకి కంటెస్టంట్‌గా వెళ్లిన జుబైర్ ఖాన్‌కి, మాఫియా డాన్ దావూద్‌కి ఎలాంటి సంబంధం లేదని, దావూద్ బంధువునని చెప్పుకుంటూ అతడు పబ్లిసిటీ చేసుకుంటున్నాడని దావూద్ కుటుంబీకులు ఆరోపించారు. ఇలా తప్పుడు వరుసలు కలుపుకుంటున్నందుకు అతని మీద కేసు పెడతామని హెచ్చరించారు. దావూద్ ఇబ్రహీంతో బంధుత్వం ఉందని చెప్పుకోవడమే కాక, హసీనా పార్కర్ జీవిత కథతో వచ్చిన చిత్రానికి సహనిర్మాతగా కూడా వ్యవహరించినట్టు జుబైర్ ఖాన్ చెప్పుకుంటున్నాడు.
ఈ విషయంపై దావూద్ కుటుంబానికి చెందిన సమీర్ ఆంటలే మాట్లాడుతూ - `జుబైర్ ఒక మోసగాడు. మా కుటుంబంతో అతనికి ఎలాంటి సంబంధాలు లేవు. ప్రచారం కోసం దావూద్ పేరును వాడుకుంటున్నాడు. ఇలాగే కొనసాగితే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం` అన్నాడు. అంతేకాకుండా హసీనా పార్కర్ కూతురు ఖాద్సియాను పెళ్లి చేసుకున్నట్లు, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు, రెండేళ్ల క్రితం ఖాద్సియా తనని వదిలేసినట్లు జుబైర్ చెబుతున్న విషయాల్లో వాస్తవం లేదని సమీర్ వెల్లడించాడు. తన పిల్లలను తన దగ్గరకి రప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే తాను బిగ్‌బాస్‌లో పాల్గొనేందుకు అంగీకరించినట్లు జుబైర్ చెప్పడం వల్ల ఖాద్సియా ఇబ్బందులు ఎదుర్కుంటోందని సమీర్ తెలిపాడు.