banking and finance: బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో పీహెచ్‌డీ చేస్తా: ఎస్‌బీఐ మాజీ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య
- ఎస్‌బీఐతో నా ప్రయాణం అద్భుతంగా సాగింది
- బ్యాంకులో ఎన్నో మార్పులు నా ముందే జరిగాయి
- అన్ని సెక్షన్లలో నేను పనిచేశా
ఎస్‌బీఐ మొదటి మహిళా చైర్మన్‌గా పనిచేసి శుక్రవారం పదవీ విరమణ పొందిన అరుంధతీ భట్టాచార్య బ్యాంకింగ్ రంగంలో తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. 40 సంవత్సరాల ఒక నెల మీద రెండు రోజుల పాటు ఎస్‌బీఐలోని వివిధ సెక్షన్లలో సేవలందించిన అరుంధతీ రిటైర్‌మెంట్ తర్వాత బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో పీహెచ్‌డీ చేయాలనే ఆశను సాకారం చేసుకుంటానని వెల్లడించారు.
కోల్‌కతా ఎస్‌బీఐలో ప్రొబెషనరీ ఆఫీసర్‌గా వృత్తి ప్రారంభించిన ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ చైర్మన్ స్థాయికి చేరుకున్నారు. తాను మొదటి రోజు బ్యాంకుకి వెళ్లినపుడు పెండింగ్‌లో ఉన్న పెద్ద పెద్ద ఫైళ్లను తన ముందు ఉంచారని, క్లౌడ్ కంప్యూటింగ్ పుణ్యమాని ఇప్పుడు అంతా కంప్యూటర్లలోకి మారిపోయిందని ఆమె పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంలో, ఎస్‌బీఐ బ్యాంకులో వచ్చిన ప్రతిష్టాత్మక మార్పులన్నీ తన కళ్ల ముందే జరిగాయని ఆమె తెలిపారు.
చదువుకునే రోజుల్లో తాను జర్నలిస్ట్ కావాలని అనుకున్నానని, అనుకోని పరిస్థితుల కారణంగా బ్యాంకింగ్ రంగం వైపుకి వచ్చినట్లు అరుంధతీ వివరించారు. ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల విలీనం, మొండి బకాయిలు రాబట్టడం తన బ్యాంకింగ్ కెరీర్‌లో చాలా ఇబ్బంది కలిగించాయని ఆమె పేర్కొన్నారు. ఎస్‌బీఐలో తన ప్రయాణం అద్భుతంగా సాగిందని, మహిళా సిబ్బందికి ఎస్‌బీఐ ఎల్లవేళలా అండంగా ఉంటుందని, వారి ఎదుగుదలకు మద్దతునిస్తుందని ఆమె చెప్పారు. 2013, అక్టోబర్ 7న ఆమె ఎస్‌బీఐ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.