m.korea: మరో కలకలం రేపేందుకు ముహూర్తం పెట్టుకున్న ఉత్తర కొరియా
- ఈ నెల 10న సుదీర్ఘ శ్రేణికి చెందిన అత్యాధునిక క్షిపణి పరీక్ష
- అమెరికాలోని ప్రధాన భూభాగాన్ని తాకే సామర్థ్యం
- ధ్రువీకరించిన రష్యా, అమెరికా
- అప్రమత్తమైన అమెరికా
అమెరికాతో పాటు జపాన్, దక్షిణకొరియా వంటి దేశాలు తీవ్రంగా హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, ప్రపంచ దేశాలు తమ దేశంతో వాణిజ్య, వ్యాపార సంబంధాలను తెంచుకుంటున్నప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తోన్న ఉత్తరకొరియా మరోసారి కలకలం రేపేందుకు సిద్ధమైంది. ఈ నెల 10న ముహూర్తం పెట్టుకున్న ఉత్తరకొరియా సుదీర్ఘ శ్రేణికి చెందిన సరికొత్త క్షిపణిని పరీక్షించేందుకు సన్నాహాలు చేస్తోందని రష్యా తేల్చిచెప్పింది. ఆ రోజున కొరియన్ వర్కర్స్ పార్టీ వార్షికోత్సవం ఉంది.
ఆ క్షిపణికి అమెరికాలోని ప్రధాన భూభాగాన్ని తాకే సామర్థ్యం ఉందని రష్యా తెలిపింది. ఇటీవల ఉత్తరకొరియా నుంచి తిరిగివచ్చిన రష్యా ఎంపీ ఆంటోన్ మోరోజోవ్ ఈ విషయాన్ని ప్రకటించారు. రష్యా మాత్రమే కాదు ఈ విషయాన్ని అమెరికా నిఘా వర్గాలు కూడా ధ్రువీకరించాయి. సాధారణంగా అక్టోబర్ 9న అమెరికాలో ‘కొలంబస్ డే’ సందర్భంగా సెలవుదినం ఉంటుంది. ఆ రోజున ‘కొరియన్ మిషన్’లో పనిచేసే సిబ్బందికి సెలవు ఇవ్వడం లేదని ప్రకటించింది. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించింది.