Amit Shah: అమిత్ షా కుమారుడిపై ఓ వెబ్‌సైట్ ఆరోపణలు.. రూ.100 కోట్లకు దావా వేసిన జే షా!

  • కంపెనీ టర్నోవర్ ఒకేసారి 16 వేల రెట్లు పెరిగిందని వార్త
  • రంగంలోకి ప్రతిపక్షాలు
  • సీబీఐ దర్యాప్తుకు డిమాండ్
  • వెబ్‌సైట్ వార్తను ఖండించిన బీజేపీ

తన పరువుకు భంగం కలిగించేలా తప్పుడు వార్త ప్రచురించిన ‘ది వైర్’ అనే వెబ్‌సైట్‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జే షా వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. వెబ్‌సైట్ కథనంతో రంగంలోకి దిగిన ఆప్, కాంగ్రెస్ పార్టీలు 'జే' సంస్థపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశాయి.

రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఫైలింగ్స్‌ను ఉంటంకిస్తూ వెబ్‌సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది. జే డైరెక్టర్‌గా ఉన్న టెంపుల్ ఎంటర్‌ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ 2013, 2014 సంవత్సరాలలో అధ్వాన పనితీరు చూపించడమే కాకుండా, ఆయా సంవత్సరాలలో రూ.6230, రూ.1724ల చొప్పున నష్టాలను చవిచూసినట్టు కంపెనీల రిజిస్ట్రార్ ఆఫీసు లెక్కలు చెబుతున్నాయి. 2014-15లో రూ.18728 లాభాలతో రూ.50 వేల టర్నోవర్ ను సాధించింది.

ఇక 2015-16 నాటికి అది ఏకంగా 16 వేల రెట్లు పెరిగి రూ.80.5 కోట్లకు చేరుకుందని కథనంలో పేర్కొంది. రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నాథ్వాని బంధువైన రాజేష్ ఖండ్వాలా నుంచి కంపెనీకి రూ.15.78 కోట్ల రుణం అందిందని, ఖండ్వాలా రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా కూడా ఉన్నారని పేర్కొంది. ఈ కథనాన్ని ఆధారంగా చేసుకుని రంగంలోకి దిగిన విపక్షాలు జే కంపెనీపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశాయి.

దీంతో స్పందించిన జే  ఆ వార్త పూర్తిగా వాస్తవ విరుద్ధమని పేర్కొన్నారు. తన కంపెనీలో ఎటువంటి అవకతవకలు జరగలేదని వివరణ ఇచ్చారు. తనను అప్రతిష్ఠ పాలు చేసే ఉద్దేశంతోనే వార్త ప్రచురించారని ఆరోపించారు. తన వ్యాపారం విజయవంతం కావడం వెనక తన తండ్రి రాజకీయ పలుకుబడి ఉందనే అపోహలకు తావిచ్చేలా ఉందని పేర్కొన్నారు. నిబంధనలకు అనుగుణంగానే తాను వ్యాపారం చేస్తున్నానని, ట్యాక్స్ రికార్డులు, బ్యాంకు లావాదేవీలు అన్నీ పారదర్శకంగా ఉన్నాయని పేర్కొంటూ తప్పుడు వార్త ప్రచురించిన వెబ్‌సైట్‌పై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నట్టు చెప్పారు.


 కాగా, జే షా నిర్వహిస్తున్న కంపెనీ టర్నోవర్ ఒక్కసారిగా రూ.80.5 కోట్లకు చేరుకున్నట్టు వార్తలు రావడంతో కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ స్పందించారు. అధికారం వచ్చిన తర్వాత కొందరి అదృష్టం మారిపోతుంటుందని వ్యాఖ్యానించారు. ఇవే ఆరోపణలు ప్రతిపక్షంపై వస్తే అరెస్ట్ చేసేందుకు  ప్రభుత్వం ఉవ్విళ్లూరుతుంటుందని అన్నారు. మోదీ అవినీతి కేసుల్లో మరోటి చేరిందని సీతారాం ఏచూరి ఆరోపించారు.
 
 
 

  • Loading...

More Telugu News