jayalalitha: అవును! ‘అమ్మ’ను నేను కూడా చూడలేదు.. బాంబు పేల్చిన తమిళనాడు మంత్రి!
- దర్యాప్తు కమిషన్ ఎదుట సాక్ష్యం చెప్పేందుకు సిద్ధమన్న నటరాజన్
- ‘అమ్మ’ గదిలోకి ఎవరినీ అనుమతించలేదని ఆరోపణ
- గతంలో ఇవే ఆరోపణలు చేసిన మంత్రి దిండిగల్ శ్రీనివాసన్
అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలితను తాను కూడా చూడలేదని ఆ రాష్ట్ర పర్యటకశాఖా మంత్రి వెల్లమండి నటరాజన్ ఆదివారం బాంబు పేల్చారు. ‘అమ్మ’ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు చూసేందుకు శశికళ కుటుంబ సభ్యులు ఎవరినీ అనుమతించలేదని ఇటీవల ఒక్కొక్కరుగా గొంతు విప్పుతుండగా తాజాగా నటరాజన్ జతకలిశారు. జయలలిత మృతిపై ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిషన్ ఎదుట సాక్ష్యం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జయ చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో రెండో అంతస్తు వరకే తాము వెళ్లగలిగామని ఆ తర్వాత ఎవరినీ ‘అమ్మ’ ఉన్న గదిలోకి వెళ్లనివ్వలేదని అన్నారు. దర్యాప్తు కమిషన్ కోరితే తనతో సహా మరింతమంది మంత్రులు సాక్ష్యం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు నటరాజన్ పేర్కొన్నారు. కాగా, జయలలితను తాను ఆసుపత్రిలో చూడలేదని ఇదివరకే మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ ప్రకటించి కలకలం రేపారు. ‘అమ్మ’ను కలవకుండా శశికళ అడ్డుకున్నారని ఆరోపించారు. జయ మృతిపై అనుమానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎ.అరుముగస్వామితో ఏకసభ్య కమిషన్ను నియమించింది. జయ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆమె మృతి చెందే వరకు ఏమి జరిగిందన్నది సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఆదేశించింది.