purandeshwari: మా వైపు నుంచి సిద్ధమే... నిర్ణయం తీసుకోవాల్సింది పవన్ కల్యాణే: ఎన్నికల్లో పొత్తుపై పురందేశ్వరి

  • పవన్ కల్యాణ్ బీజేపీకి మిత్రుడే
  • పొత్తుపై సానుకూల సంకేతాలు వస్తే నిర్ణయం
  • ప్రత్యేక హోదాను మించి ఏపీకి లాభాలు
  • దక్షిణాదిలో బీజేపీ ప్రాతినిధ్యం పెరుగుతుందన్న పురందేశ్వరి

తదుపరి ఎన్నికల్లో జనసేన, భారతీయ జనతా పార్టీ కలసి పోటీ చేసే విషయమై బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ తమకు మిత్రుడేనని చెప్పిన ఆమె, పొత్తుకు తామెప్పుడూ ఓపెన్ గానే ఉంటామని, ఎవరితో కలసి వెళ్లాలన్న విషయమై తుది నిర్ణయం తీసుకోవాల్సింది పవన్ కల్యాణేనని స్పష్టం చేశారు.

ఆయన వైపు నుంచి సానుకూల సంకేతాలు వస్తే, పొత్తుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఓ టీవీ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన పురందేశ్వరి, రెండు పాచిపోయిన లడ్డూలను కేంద్రం ఏపీ ప్రజల చేతుల్లో పెట్టిందని గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రత్యేక హోదా సమసిపోయిన అంశమని, అంతకు మించిన లాభాన్ని రాష్ట్రం ఇప్పుడు ప్యాకేజీ రూపంలో అందుకుంటోందని అన్నారు.

పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టకుండా, కేంద్రానికే అప్పగిస్తే మరింత త్వరగా పనులు పూర్తయ్యుండేవని అభిప్రాయపడ్డ ఆమె, తదుపరి ఎన్నికల్లోగా, పోలవరం స్పిల్ వే, కాపర్ డ్యామ్ తదితరాల నిర్మాణం పూర్తవుతుందని భావించడం లేదని తెలిపారు. జీఎస్టీ, నోట్ల రద్దు వంటి సంస్కరణల తరువాత ప్రజలకు సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో పార్టీ జాతీయ నాయకత్వం పడిపోయిందని వస్తున్న విమర్శలను పురందేశ్వరి కొట్టి పారేశారు.

ఆ పరిస్థితి వచ్చిందని తాను అనుకోవడం లేదని, అయితే, కొన్ని విషయాలపై ప్రజలకు విడమరచి చెప్పాల్సిన అవసరం మాత్రం ఉందని అన్నారు. ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని మోదీ నిర్ణయాలు తీసుకోవడం లేదని అన్నారు. దేశాభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందని తెలిపారు. కొన్ని కీలక నిర్ణయాల వల్ల స్వల్పకాల నష్టాలు ఉంటాయని, అవి దీర్ఘకాలంలో అభివృద్ధికి సోపానాలుగా మారుతాయని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో దక్షిణాదిలో బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తుందని, కర్ణాటకలో అధికారంలోకి వస్తామని, ఏపీలో, కేరళలో మరింత బలపడతామని అన్నారు.

  • Loading...

More Telugu News