rani mukherjee: రాణీ ముఖర్జీకి మారిషస్ దేశ సత్కారం... 50వ స్వాతంత్ర్య దినం సందర్భంగా అవార్డు
- మరో ఫ్రెంచి నటితో పురస్కారం పంచుకున్న రాణి
- సన్మానించిన మారిషస్ ప్రధాని
- ఆనందం వ్యక్తం చేసిన నటి
బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీని మారిషస్ దేశ ప్రభుత్వం సత్కరించింది. తమ దేశ 50వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా గత 20 ఏళ్లుగా సినీరంగానికి తన వంతు ప్రతిభను సమకూరుస్తున్నందుకు గాను ఆమెకు ఈ 'అవుట్‌స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు సినిమా' అవార్డును అందజేసింది. ఫ్రెంచి నటి ఎమ్మాన్యుయేల్ బీయర్ట్‌తో కలిసి రాణీ ముఖర్జీ ఈ అవార్డును పంచుకుంది.
మారిషస్ దేశ ప్రధాని ప్రవింద్ కుమార్ జగన్నాథ్ ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా రాణీ ముఖర్జీ మాట్లాడుతూ - `ఈ అవార్డు ఇచ్చినందుకు మారిషస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఫ్రెంచి, భారత సినిమాలను ఒకే వేదికపై సత్కరించిన అరుదైన ఘటన ఈ వేడుకల్లో జరిగింది. నేను నటించిన `బిచ్చూ`, `హలో బ్రదర్`, `కుచ్ కుచ్ హోతా హై` సినిమాల్లో కొన్ని సన్నివేశాల షూటింగ్ ఇక్కడే జరిగింది. నన్ను అభిమానిస్తున్న ఇక్కడి భారతీయులందరికీ థాంక్యూ!` అని చెప్పింది.