theft: దొంగతనానికి ప్రయత్నించాడని నైజీరియన్ ని చితకబాదిన కాలనీ వాసులు!
- ఢిల్లీలో జరిగిన ఘటన
- వైరల్‌గా మారిన వీడియో
- విచారణ చేపట్టిన పోలీసులు
ఒక నైజీరియన్‌ని కాళ్లు, చేతులు కట్టేసి కొంతమంది యువకులు కర్రలతో కొడుతున్న వీడియో ఒకటి ఇవాళ సోషల్ మీడియాలో కనిపించింది. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇందులో ఆ నైజీరియన్ క్షమించాలని వేడుకుంటున్నా అతన్ని హింసించడం కనిపిస్తోంది.
ఒక మహిళ అతన్ని చెప్పుతో కొట్టడం, నైజీరియన్ జేబులో రూ. 6000 దొరికాయని ఓ వ్యక్తి అరుస్తుండటం ఈ వీడియోలో ఉంది. మాలవీయ నగర్‌లోని ఓ అపార్టుమెంట్లో ఈ నైజీరియన్ దొంగతనానికి విఫలయత్నం చేసి స్థానికులకు దొరికిపోయాడని, అందుకే అతన్ని ఇలా కొట్టి ఉంటారని పోలీసులు చెబుతున్నారు.
సెప్టెంబర్ 24న మాలవీయ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి దొంగతనం కేసు పెట్టాడని, దాన్ని విచారణ చేపట్టి ఓ నైజీరియన్‌ని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. అయితే వీడియోలో ఉన్న నైజీరియన్, తాము అరెస్ట్ చేసిన నైజీరియన్ ఒకే వ్యక్తా? కాదా? అనే విషయం గురించి విచారణ చేపడుతున్నట్లు వారు చెప్పారు.