parole: పెరోల్ పేరుతో బయటికి వచ్చి.. తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న శశికళ?
- ఏం జరుగుతుందోనని తీవ్ర ఉత్కంఠ
- మళ్లీ తెరపైకి స్లీపెర్ సెల్స్ అంశం
- మంగళవారంతో ముగియనున్న పెరోల్
జయలలిత చనిపోయిన నాటి నుంచి తమిళనాడు రాజకీయాల్లో రోజుకో పరిణామం చోటు చేసుకుంటోంది. శశికళ జైలుకెళ్లడం, పళనిస్వామి, పన్నీర్ సెల్వం కలిసిపోవడం, టీటీవీ దినకరన్ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తుండటం... ఇలా ప్రతి ఒక్కటీ తమిళ రాజకీయాలను వార్తల్లో నిలిచేలా చేస్తున్నాయి. ఇటీవల పెరోల్ మీద శశికళ బయటికి రావడంతో రాజకీయాల్లో ఎలాంటి కొత్త పరిణామం జరుగుతుందోనని తమిళులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
దినకరన్ చెప్పినట్లుగా అధికార ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే స్లీపర్ సెల్స్ ఇప్పుడు బయటపడే అవకాశం ఉందేమోనని అభిప్రాయపడుతున్నారు. తాజాగా మంత్రి సెల్లూర్ రాజు చేసిన వ్యాఖ్యలు వారి అభిప్రాయానికి బలం చేకూరుస్తున్నాయి. తాను స్లీపర్ సెల్ కాదని సెల్లూర్ రాజ్ స్పష్టం చేయడంతో నిజంగానే స్లీపర్ సెల్స్ ఉండి ఉంటారని అనుమానిస్తున్నారు. అవసరమైనప్పుడు తమకు అనుకూలంగా 60 మంది ఎమ్మెల్యేలు వస్తారని, వారంతా ముఖ్యమంత్రి వర్గంలోనే ఉన్నారని టీటీవీ దినకరన్ చెప్పిన మాటలు నిజమయ్యే సూచనలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.
వారు భావించినట్లుగానే శశికళ చెన్నైకి వచ్చినప్పటి నుంచి అధికార పార్టీలోని నాయకులలో ముఖ్యంగా శశికళ, టీటీవీ దినకరన్ మద్దతుదారుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. పెరోల్ నిబంధనలు అడ్డువస్తున్నప్పటికీ ఆమెతో భేటీ కావడానికి కూడా కొంతమంది ప్రయత్నిస్తున్నారు. నివాసం, ఆసుపత్రి కేంద్రాలుగా శశికళ రాజకీయ వ్యవహారాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై తమ మద్దతుదారులకు శశికళ దిశానిర్దేశం చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. మంగళవారంతో పెరోల్ గడువు ముగియనుండటంతో ఆలోపు తన ఆలోచనలకు తుది రూపం తీసుకురావాలని శశికళ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే ఆమె తిరిగి జైలుకు వెళ్లేలోపు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ కొనసాగుతోంది. పెరోల్ గడువు మంగళవారం ముగియనున్న నేపథ్యంలో పళనిస్వామి వర్గం నుంచి ఎవరైనా నోరు విప్పుతారా? శశికళ తిరిగి వెళుతూ రాజకీయాలను ఏదైనా అనూహ్య మలుపు తిప్పుతారా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉండగా కేవలం ఆస్తి సమస్యల పరిష్కారానికే శశికళ పెరోల్‌పై బయటకు వచ్చారని మంత్రి జయకుమార్ ఆరోపించారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ... తమ ప్రభుత్వం ఏర్పడటానికి శశికళ కారణమని చెప్పిన మంత్రి సెల్లూరు రాజు వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించారు. దినకరన్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని పేర్కొన్నారు. మరో పక్క భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై కూడా శశికళ పెరోల్‌పై బయటకు రావడంపై స్పందించారు. ఆమెకు పెరోల్ ఇవ్వటంలో నిబంధనల అతిక్రమణ జరిగిందని ఆమె ఆరోపించారు.