delhi metro: ఓలా, ఉబెర్ లకు మేలు చేసేందుకే మెట్రో రైలు ఛార్జీలు పెంచారు: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి
- ఢిల్లీ మెట్రోను ప్రీమియమ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ గా మార్చాలనుకుంటున్నారు
- ఛార్జీలు పెరిగితే జనాలు క్యాబ్స్ చూసుకుంటారు
- వాతావరణ కాలుష్యం ఎక్కువవుతుంది
పెరిగిన ఢిల్లీ మెట్రో రైలు ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ శిసోడియా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఓలా, ఉబెర్ లాంటి ప్రైవేట్ క్యాబ్ లకు మేలు చేసేందుకే ఛార్జీలను పెంచారని ఆయన మండిపడ్డారు. ప్రజల డబ్బుతోనే మెట్రో నడుస్తోందని... వారెవరూ ఛార్జీలు పెరగాలని కోరుకోవడం లేదని అన్నారు.
ప్రైవేట్ క్యాబ్ లు, ట్యాక్సీల కన్నా మెట్రో ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని... దీంతో, క్యాబ్స్ కు మేలు జరుగుతుందని చెప్పారు. ఢిల్లీ మెట్రోను 'ప్రీమియమ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్'గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని... దీన్ని ఆప్ ప్రభుత్వం అంగీకరించదని అన్నారు. మెట్రో ఛార్జీలు పెరిగితే... ప్రజలంతా క్యాబ్ ల వైపు మొగ్గుచూపుతారని... దీంతో నగరంలో వాతావరణ కలుషితం మరింత పెరుగుతుందని చెప్పారు.