glass bridge: ఈ గాజు వంతెన మీద అడుగు వేయగలరా!... మరైతే వీడియో చూడండి
- పర్యాటకులను ఆకర్షిస్తున్న పగుళ్ల వంతెన
- పగుళ్ల కోసం స్పెషల్ ఎఫెక్ట్స్
- ప్రమాదం లేదంటున్న నిర్వాహకులు
ఎత్తు మీద ఉండే వంతెన మీద నడవాలంటేనే చాలా మందికి భయం వేస్తుంది. అందులోనూ గాజు వంతెన అయితే అసలు అటు పక్కకే వెళ్లరు. ఇక అడుగు వేయగానే పగుళ్లు వచ్చే గాజు వంతెన అంటే వణకడం ఖాయం. కానీ ఇప్పుడు అదే వంతెన ఎక్కడానికి పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఉత్తర చైనాలోని హుబేయి ప్రావిన్స్‌లో ఈస్ట్ తైహెంగ్ గ్లాస్‌వాక్ పేరుతో గాజువంతెన ఉంది. 872 అడుగుల పొడవు, 6.6 అడుగుల వెడల్పుతో భూమికి 3800 అడుగుల ఎత్తులో ఉండే ఈ వంతెన మీద అడుగు పెడితే చాలు పగుళ్లు పడతాయి. దీంతో వంతెన ఎక్కినవారు మొదట భయంతో కేకలు వేసినా, తర్వాత ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు.
పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ బ్రిడ్జిలో చివరి భాగాన్ని ఇలా పగుళ్లు పడే గాజువంతెనగా మార్చారు. ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ సాయంతో అడుగు వేసిన చోట పగుళ్లు ఏర్పడే అనుభూతి కలిగేలా స్పెషల్ ఎఫెక్ట్స్ ఏర్పాటుచేశారు అక్కడి నిర్వాహకులు. ఈ గాజు వంతెన అత్యంత భద్రతా ప్రమాణాలతోనే నిర్మించామని, ప్రమాదం జరుగుతుందేమోనన్న భయం అవసరం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ వంతెనపై పర్యాటకులు నడుస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.