women: ఆరెస్సెస్‌లోని మహిళలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
- ఆరెస్సెస్‌లోని మహిళలు నిక్కర్లు ఎందుకు ధరించరని ప్రశ్న
- తాము అధికారంలోకి వస్తే మహిళా సాధికారతకు కృషి చేస్తామన్న రాహుల్
- మహిళలు నోరు విప్పడాన్ని బీజేపీ, ఆరెస్సెస్‌లు తట్టుకోలేవని ఆరోపణ
గుజరాత్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహల్ గాంధీ ఆరెస్సెస్‌లోని మహిళలపై సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)లోని మహిళలపై వివక్ష కొనసాగుతోందన్నారు. వారెప్పుడైనా నిక్కర్లు ధరించడం చూశారా? అని ప్రశ్నించి విమర్శలకు కారణమయ్యారు. ఆరెస్సెస్ కార్యకర్తలు నిక్కర్లు ధరిస్తారని, కానీ ఆ సంస్థలోని మహిళలకు మాత్రం ఆ అవకాశం లేదని వాపోయారు.
‘‘బీజేపీకి ఆరెస్సెస్ ప్రధాన సంస్థ. అందులో ఎందరు మహిళలున్నారు? మీరేదైనా శాఖలోని మహిళలను షార్టులు వేసుకోగా చూశారా? నేనైతే ఎప్పుడూ చూడలేదు’’ అని అన్నారు. మహిళలు నోరు తెరవడాన్ని బీజేపీ, ఆరెస్సెస్ అంగీకరించవని, వారు మౌనంగా ఉండాలనే కోరుకుంటాయని ఆరోపించారు. వారి నోళ్లు మూయించేందుకు ఆ రెండూ పరుగులు తీస్తుంటాయన్నారు.
గుజరాత్లో కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే మహిళా సాధికారతపై దృష్టి సారిస్తామన్నారు. మహిళల విద్య, ఆరోగ్యంపైనా శ్రద్ధ తీసుకుంటామన్నారు. మీకేం కావాలో మోదీ ఎప్పుడైనా మాట్లాడారా? అని రాహుల్ ప్రశ్నించారు. ఆరెస్సెస్‌లోని మహిళలపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.