team india: విజయంతో టోర్నీని ఆసక్తికరంగా మార్చిన ఆసీస్!
- ఆసక్తిగా ఫైనల్ పోరు
- సాధికారిక విజయంతో ఆకట్టుకున్న ఆసీస్
- బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ లో రాణించిన ఆస్ట్రేలియా జట్టు
అవమాన భారంతో స్వదేశం చేరడం కష్టమని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ చెప్పిన మాటలను యాక్టింగ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సీరియస్ గా తీసుకున్నాడు. దీంతో తనకు అచ్చొచ్చిన టీ20 సిరీస్ లో జట్టులో స్పూర్తి పెంచాడు. ఆల్ రౌండర్లు, స్పెషలిస్టు బ్యాట్స్ మన్, బౌలర్ల సాయంతో రెండో టీ20ని సొంతం చేసుకున్నాడు. టాస్ గెలిచి భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించిన వార్నర్ నిర్ణయం సరైనదేననిపించేలా బెహ్రెన్ డార్ఫ్ చెలరేగాడు. వరుసగా రోహిత్ శర్మ, కోహ్లీ, ధావన్ లను అవుట్ చేసి, టీమిండియా టాప్ ఆర్డర్ నడ్డి విరిచాడు.
అతనికి ఆడం జంపా తోడయ్యాడు. జాదవ్, ధోనీలను అవుట్ చేయడంతో టీమిండియా స్వల్పస్కోరుకే పరిమితమైంది. చివర్లో పాండ్య ఫర్వాలేదనిపించాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ ఆరంభంలోనే ఫించ్, వార్నర్ ల వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్ కు దిగిన ట్రవిస్ హెడ్, మోజెస్ హెన్రిక్స్ చెలరేగి ఆడారు. మంచి బంతులను గౌరవిస్తూ, చెత్తబంతులను బౌండరీలు దాటిస్తూ జట్టుకు విజయాన్నందించారు. దీంతో మూడు మ్యాచ్ ల సిరీస్ ఆసక్తిగా మారింది. ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్ లను సొంతం చేసుకున్న టీమిండియాను ఓడించి టీ20 టైటిల్ సాధించి, పరువు నిలుపుకోవాలని ఆసీస్ జట్టు భావిస్తోంది.