natarajan: శశికళ భర్తకు ప్రాణం పోసిన దినసరి కూలీ
- కార్తీక్ అనే యువకుడి అవయవాలను అమర్చారు
- బ్రెయిన్ డెడ్ అయిన కార్తీక్
- అవయవ దానానికి ఒప్పుకున్న తల్లిదండ్రులు
అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ భర్త నటరాజన్ (74) చావు అంచుల వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. అతని కిడ్నీ, లివర్ పూర్తిగా పాడైపోయాయి. ఈ నేపథ్యంలో, ఆయన ప్రాణాలను దినసరి కూలీగా పని చేసే ఓ పోస్టర్ బోయ్ నిలబెట్టాడు.
వివరాల్లోకి వెళ్తే, తమిళనాడులోని పుదుకోట జిల్లా అరంగాంగి సమీపంలోని కూత్తాడివయన్ అనే గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువకుడు కార్తీక్ ఓ ప్రింటింగ్ ప్రెస్ లో దినసరి కూలీగా పని చేస్తున్నాడు. సెప్టెంబర్ 30న తన స్నేహితుడి బైక్ పై వెళుతుండగా ఓ కారు అతడని బలంగా ఢీకొంది. తీవ్ర గాయాలపాలైన కార్తీక్ ను చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రికి తరలించగా... బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు నిర్ధారించారు.
పోయిన బిడ్డ తిరిగి రాలేడు... అవయవదానం చేస్తే, మరికొంతమందికి జీవితం ప్రసాదించే అవకాశం ఉంటుందని కార్తీక్ తల్లిదండ్రులకు వైద్యులు సూచించారు. దీంతో, అవయవదానానికి వారు ఒప్పుకున్నారు. కార్తీక్ అవయవాలను నటరాజన్ సహా ముగ్గురు రోగులకు అమర్చారు. నటరాజన్ కు కిడ్నీలు, కాలేయాన్ని అమర్చారు. 43 ఏళ్ల మరో రోగికి గుండెను, 62 ఏళ్ల వృద్ధుడికి ఊపిరితిత్తులను అమర్చారు.