kapil sharma: కపిల్ శర్మ, సల్మాన్ ఖాన్ల గురించి నెట్లో సెర్చ్ చేస్తున్నారా?... అయితే ప్రమాదంలో పడ్డట్లే!
- ఇంటర్నెట్లో రిస్కీయెస్ట్ సెలబ్రిటీల జాబితాను ప్రకటించిన మెకాఫీ
- వీరి పేర్ల వల్ల ప్రమాదకర వెబ్సైట్లను ఓపెన్ చేసే అవకాశం
- సెర్చ్ చేసేముందు ఆలోచించండని హెచ్చరిక
ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పేర్లను ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ప్రమాదకర వెబ్సైట్లను ఓపెన్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని సైబర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ వెల్లడించింది. ఇంటర్నెట్లో రిస్కీయెస్ట్ సెలబ్రిటీల జాబితాను ఈ సంస్థ ప్రకటించింది. `మోస్ట్ సెన్సేషనల్ సెలబ్రిటీస్` పేరుతో ఈ జాబితాను విడుదల చేసింది. ఇందులో కపిల్, సల్మాన్‌లు మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. కపిల్ శర్మ గురించి వెతికితే 9.58 శాతం వైరస్‌ను వ్యాపించే వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసే అవకాశముందని తెలిపింది.
అలాగే సల్మాన్, ఆమిర్ ఖాన్ల గురించి సెర్చ్ చేస్తే 9.03 శాతం, 8.89 శాతం ప్రమాదకర సైట్లను ఓపెన్ చేసే అవకాశం ఉందని తెలిపింది. గతేడాది ఈ జాబితాలో మొదటి స్థానంలో సోనాక్షి సిన్హా ఉండేది. ఈసారి టాప్ 10 రిస్కీ సెలబ్రిటీల్లో ఆమె పేరు లేకపోవడం గమనార్హం. ఇంకా ఈ జాబితాలో నాలుగో స్థానంలో ప్రియాంక చోప్రా ఉన్నారు. అనుష్క శర్మ, సన్నీ లియోన్, కంగనా రనౌత్, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్, టైగర్ ష్రాఫ్‌లు తర్వాతి స్థానాల్లో నిలిచారు. వీరి గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేసేముందు ఒకసారి ఆలోచించండని మెకాఫీ సంస్థ ప్రతినిధి వెంకట్ క్రిష్ణాపూర్ తెలిపారు.