roja: జగనన్న చేయని తప్పుకి చాలా నెలలు జైల్లో ఉన్నారు: ఎమ్మెల్యే రోజా
- జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర విజయవంతం అవుతుంది
- ఎలాంటి అడ్డంకులు రావు
- జగన్ వారంలో ఒక్కరోజు కోర్టుకు వెళితే సరిపోతుంది
- ప్రజల చిరునవ్వుకోసం పాటుపడుతోన్న జగనన్న జైలుకి వెళ్లాల్సి వచ్చింది
తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేయనున్న పాదయాత్రకు అనుమతి వస్తుందా? రాదా? అన్న విషయం రెండో విషయమని, జగన్ చేయాలనుకున్నది చేస్తారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ రోజు హైదరాబాద్లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో రోజా మాట్లాడుతూ... పాదయాత్ర విషయం గురించి ఇప్పటికే కోర్టును ఆశ్రయించామని, శుక్రవారం ఒక్కరోజు జగన్ కోర్టుకు వెళితే సరిపోతుందని, పాదయాత్ర చేయొద్దని కోర్టు చెప్పదని వ్యాఖ్యానించారు.
‘మాకు ప్రజా సమస్యలు ముఖ్యం, రాజశేఖర్ రెడ్డి ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చూడాలనుకున్నారు. ఆ చిరునవ్వు కోసమే జగనన్న పాటుపడుతుంటే, ఆయన చేయని తప్పుకి ఎన్ని నెలలు జైల్లో ఉన్నారో కూడా మీరు చూశారు’ అని రోజా వ్యాఖ్యానించారు. ఎవరో ఏదో అంటున్నారని పాదయాత్రను ఆపే ప్రసక్తే ఉండబోదని చెప్పారు. వైఎస్ జగన్ పోరాట యోధుడని రోజా అన్నారు. ప్రజలకు భరోసా ఇస్తూ జగన్ పాదయాత్ర చేస్తారని చెప్పారు.
జగన్ పాదయాత్ర విజయవంతం అవుతుందని రోజా చెప్పారు. రాజధాని పేరుతో గ్రాఫిక్స్ చూపిస్తూ మోసం చేస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు ఏమీ తీసుకురాలేకపోయారని విమర్శించారు. చంద్రబాబు కేసుల నుంచి తప్పించుకునేందుకు, కేంద్ర ప్రభుత్వం వద్ద తల ఊపి ప్యాకేజీ కావాలంటున్నారని అన్నారు. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేకపోతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు తన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్పై బురద చల్లడం సరికాదని అన్నారు.