china. bus: అందుకే సీట్ బెల్ట్ పెట్టుకోమని చెబుతారు... ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డ బస్సు ప్రయాణికులు.. వీడియో!
- చైనాలోని హుజ్హౌ సిటీలో ఘటన
- బస్సును ఢీ కొన్న కారు
- ప్రయాణికులు సీటు బెల్టులు పెట్టుకోవడంతో తప్పిన ప్రమాదం
- పెట్టుకోని వారు ఎగిరిపడ్డ వైనం
నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా సీటు బెల్టు పెట్టుకోవాలని పోలీసులు సూచిస్తుంటారు. అయితే, ఎంతో మంది ఆ సూచనలని పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. సీటు బెల్టు పెట్టుకుంటే ఘోర ప్రమాదాల నుంచి కూడా తప్పించుకోవచ్చని చైనాలో జరిగిన ఓ ఘటన నిరూపిస్తోంది. ఇటీవల జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించిన ఈ వీడియోను తాజాగా యూ ట్యూబ్‌లో ఉంచారు.
చైనాలోని హుజ్హౌ సిటీలో ఓ బస్సు అతి వేగంగా వెళుతోంది. దాని పక్కనుంచే వెళుతోన్న ఓ కారు ఒక్కసారిగా ఆ బస్సును ఢీ కొట్టింది. దీంతో బస్సును అదుపు చేసే క్రమంలో బస్సు డ్రైవర్ స్టీరింగ్‌ను ఒక్కసారిగా కుడివైపునకు తిప్పాడు. దీంతో బస్సులోని ప్రయాణికులంతా ఉలిక్కి పడ్డారు. వారిలో చాలా మంది సీటు బెల్టు పెట్టుకుని ఉండడంతో వారికి చిన్న గాయం కూడా కాలేదు. వారంతా సీట్లకు అతుక్కుపోయినట్లు అలాగే ఉండిపోయారు. అయితే సీటు బెల్టు పెట్టుకోని వారు మాత్రం ఎగిరిపడ్డారు. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ దృశ్యాలన్నీ బస్సులోని సీసీటీవీలో రికార్డయ్యాయి.