Rahul gandhi: మోదీ ప్రతీ గుజరాతీకి చంద్రుడిపై ఇల్లు కట్టించి ఇస్తారు.. ప్రధానిపై మరోమారు సెటైర్ వేసిన రాహుల్!
- 2030 నాటికి చంద్రుడినే భూమికి దించేస్తారని ఎద్దేవా
- పేదలకు కలలు అమ్మేస్తున్నారని ఆరోపణ
- ముగిసిన రాహుల్ గుజరాత్ పర్యటన
ఇటీవల ప్రధాని నరేంద్రమోదీపై వరుసగా వాగ్బాణాలు సంధిస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోమారు నిప్పులు చెరిగారు. గుజరాత్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విమర్శలకు మరింత పదునుపెంచారు. ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న రాహుల్ బుధవారం మాట్లాడుతూ.. పేద ప్రజలకు మోదీ కలలు అమ్మేస్తున్నారని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. 2028 నాటికి మోదీ ప్రతీ గుజరాతీకి చంద్రుడిపై ఇల్లు కట్టించి ఇస్తారని ఎద్దేవా చేశారు. అంతేకాక 2030 నాటికి ఏకంగా చంద్రుడినే భూమికి తీసుకొస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఈ ఏడాది డిసెంబరు చివరిలోకానీ, వచ్చే ఏడాది మొదట్లో కానీ గుజరాత్ శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు పోటాపోటీ ప్రచారం ప్రారంభించారు. రాహుల్ గాంధీ అయితే ఏ చిన్న అవకాశం దొరికినా ప్రధానిపై విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల అమిత్ షా కుమారుడు జై షా కంపెనీపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, బుధవారంతో రాహుల్ గుజరాత్ పర్యటన ముగిసింది.