dantuluri dileep: వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న కాంగ్రెస్ నేత దంతులూరి
- కాంగ్రెస్ కు రాజీనామా చేసిన పీసీసీ కార్యదర్శి
- నేడు జగన్ సమక్షంలో వైసీపీలో చేరిక
- ఆయన చేరికను వ్యతిరేకిస్తున్న కొందరు స్థానిక నేతలు
ఏపీసీసీ కార్యదర్శి, విశాఖ కాంగ్రెస్ నేత, తుమ్మపాల షుగర్స్ మాజీ ఛైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి పంపారు. ఆయన వైసీపీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్ ను కలిసేందుకు ఆయన తన అనుచరవర్గంతో కలసి జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ బయల్దేరారని సమాచారం.
ఈరోజు జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అయిన దంతులూరి రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఓటమిపాలయ్యారు. 1995లో టీడీపీలో చేరిన ఆయన... మళ్లీ కొన్నిరోజులకే సొంతగూటికి చేరుకున్నారు.
మరోవైపు వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్ నాథ్ లు ఇటీవల దిలీప్ ఇంటికి వెళ్లి వైసీపీలో చేరాలని ఆహ్వానించారని, ఆయన సుముఖత వ్యక్తం చేశారని, దీంతో 12వ తేదీన వైసీపీలో చేరాలని ఆ రోజే నిర్ణయించినట్టు కూడా సమాచారం. అయితే, దిలీప్ రాకను కొంతమంది స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం.