aarushi: ఆరుషి కేసులో తల్లిదండ్రులు నిర్దోషులు.. సంచలన తీర్పునిచ్చిన అలహాబాద్ హైకోర్టు!
- ఆరుషి తల్లిదండ్రులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు
- సరైన ఆధారాలు చూపించలేకపోయిన సీబీఐ
- జైలు నుంచి విడుదలకానున్న తల్వార్ దంపతులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి హత్యకేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఆరుషి తల్లిదండ్రులు నూపుర్ తల్వార్, రాజేశ్ తల్వార్లను నిర్దోషులుగా ప్రకటించింది. సీబీఐ సరైన ఆధారాలు చూపించలేదని పేర్కొంటూ తల్వార్ దంపతులను నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో గత నాలుగేళ్లుగా దాస్నా జైలులో ఉన్న తల్వార్ దంపతులు ఇప్పుడు విడుదల కానున్నారు.
2008 మే 16న ఆరుషి తన బెడ్రూంలో హత్యకు గురైంది. మొదట వారి పనిమనిషి హేమరాజ్ హత్య చేసుంటాడని అనుమానపడ్డారు. రెండ్రోజుల తర్వాత హేమరాజ్ శవం కూడా ఆరుషి ఇంటి మీద కనిపించడంతో ఈ రెండు హత్యలు ఎవరు చేసుంటారోనన్న సందిగ్ధం ఏర్పడింది. చివరికి ఆరుషి తల్లిదండ్రులు ఈ హత్యలు చేసుంటారని భావించి సీబీఐ వారిని అరెస్టు చేసి అభియోగ పత్రాలు దాఖలు చేసింది.
విచారణ అనంతరం సీబీఐ న్యాయస్థానం ఈ కేసులో ఆరుషి తల్లిదండ్రులను దోషులుగా పేర్కొంటూ 2013లో వారికి యావజ్జీవ జైలు శిక్ష విధించింది. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ కేసులో వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ అలహాబాద్ కోర్టు నేడు తీర్పునిచ్చింది. దీనిపై సీబీఐ సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.