pakistan: పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌కు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
- జారీ చేసిన పాకిస్థాన్ ఎలక్షన్ కమిషన్
- కోర్టుకు హాజరుకాకుండా కాలం వెళ్లబుచ్చుతున్న ఇమ్రాన్
- అక్టోబర్ 26న విచారణకు హాజరుపరచాలని ఆదేశం
పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా నాన్-బెయిలబుల్ అరెస్టు వారెంట్‌ను జారీ చేస్తూ పాకిస్థాన్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. పీటీఐ భావజాల వ్యతిరేకి అక్బర్ ఎస్. బాబర్ వేసిన కేసులో విచారణకు హాజరుకాకుండా ఇమ్రాన్ ఖాన్ కాలం వెళ్లబుచ్చుతున్నాడు. దీనిపై మండిపడిన ఎలక్షన్ కమిషన్ అక్టోబర్ 26న జరగనున్న తదుపరి విచారణకు ఆయనని హాజరు పరచాలని అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
అయితే ఈ వారెంట్‌ను సవాలు చేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయిస్తామని పీటీఐ ప్రతినిధి నయీముల్ హక్ తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే రెండు సార్లు షోకాజ్ నోటీసులు, బెయిలబుల్ వారెంట్లను ఎలక్షన్ కమిషన్ జారీ చేసింది. వాటిని ఇమ్రాన్ ఖాన్ లక్ష్యపెట్టలేదు. దీంతో విచారణలు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.