tata sons: టాటా వారి టెలికాం వ్యాపారాన్ని సొంతం చేసుకున్న ఎయిర్‌టెల్!
- టీటీఎల్, టీటీఎంఎల్ కంపెనీలు ఎయిర్‌టెల్ పరం
- ఒప్పంద విలువను బహిర్గతం చేయని కంపెనీలు
- ఆనందం వ్యక్తం చేసిన ఇరు కంపెనీల చైర్మన్లు
టాటా వారి టెలికాం వెంచర్స్ టాటా టెలి సర్వీసెస్ లిమిటెడ్ (టీటీఎల్), టాటా టెలి సర్వీసెస్ మహారాష్ట్ర లిమిటెడ్ (టీటీఎంఎల్)లను ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ చేజిక్కించుకుంది. ఈ మేరకు రెండు సంస్థలు ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించాయి. అయితే ఎంత మొత్తానికి ఎయిర్‌టెల్ సొంతం చేసుకుందనే విషయాన్ని వారు బహిర్గతం చేయలేదు. ఈ ఒప్పందం ద్వారా దేశంలో ఉన్న 19 టెలికాం సర్కిళ్లలో ఉన్న టాటా మొబైల్ బిజినెస్ ఎయిర్‌టెల్ హస్తగతమైంది.
టాటా టెలికాం సంస్థలను దక్కించుకోవడం ద్వారా ఎక్కువ మొత్తంలో వినియోగదారులకు టెలికాం సేవలు అందించే సదుపాయం కలుగుతుందని భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ తెలిపారు. ప్రధాన సర్కిళ్లలో ఉత్తమ సేవలు అందించి వినియోగదారుడిని సంతృప్తి పరుస్తామని ఆయన పేర్కొన్నారు. ఎయిర్‌టెల్ వారితో ఒప్పందం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ చెప్పారు.