Facebook: వైర్ లెస్ 'వర్చువల్ రియాలిటీ' హెడ్‌సెట్‌ను ఆవిష్కరించిన ఫేస్బుక్
- కంప్యూటర్, మొబైల్‌కు అనుసంధానం కాకుండానే పనిచేసే ‘ఓకులస్ గో’
- ఫేస్‌బుక్‌ను వర్చువల్ రియాలిటీలో చూసుకునే అవకాశం
- హెచ్‌టీసీ వైవ్కు గట్టి పోటీ ఇవ్వనున్న ఓకులస్ గో
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ నుంచి అతి త్వరలో వైర్ లెస్ వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ రాబోతోంది. ఫేస్బుక్ వర్చువల్ రియాలిటీ డివిజన్ వార్షిక సమావేశంలో సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఈ హెడ్‌సెట్‌ను ఆవిష్కరించారు. వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానున్న ఈ పరికరం ధర రూ.199 డాలర్లు (దాదాపు రూ.13 వేలు).
‘ఓకులస్ గో’ పేరుతో వస్తున్న ఈ పరికరాన్ని కంప్యూటర్, మొబైల్ ఫోన్‌కు అనుసంధానం చేయకుండానే ఉపయోగించుకోవచ్చు. హై రిజల్యూషన్ ఎల్సీడీ స్క్రీన్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. హెచ్‌టీసీ నుంచి వచ్చిన ‘వైవ్’కు ఓకులస్ గో గట్టి పోటీ ఇస్తుందని చెబుతున్నారు.
ఇక ధర విషయంలో రెండింటి మధ్య భారీ తేడా ఉంది. వైవ్ ధర 599 డాలర్లు (దాదాపు రూ.39వేలు). తమ వందకోట్ల మంది యూజర్లకు వర్చువల్ రియాలిటీని అందించాలన్న ఫేస్బుక్ లక్ష్యం ఓకులస్ గోతో సాధ్యం కానుందని ఫేస్బుక్ తెలిపింది. గేమింగ్, వీడియో వీక్షణ, సోషల్ నెట్వర్కింగ్ సైట్లను ఇక వర్చువల్ రియాలిటీలో చూడొచ్చని జుకర్ బర్గ్ పేర్కొన్నారు.