rss: అమిత్ షా కుమారుడి వ్యవహారంపై ఆర్ఎస్ఎస్ స్పందన ఇది!
- భోపాల్ సమావేశంలో స్పందించిన ఆర్ఎస్ఎస్
- ఎవరిపైనైనా అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వారిపై విచారణ జరగాలి
- ఆరోపణలు చేసిన వారు వాటిని నిరూపించాలి
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తనయుడు జై షా అక్రమాస్తులు కూడగట్టినట్టు 'ద వైర్' అనే వెబ్ సైట్ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. బీజేపీ అధికారంలోకి రాగానే జై షా సంస్థ టర్నోవర్ కొన్ని వేల రెట్లు పెరిగిపోయిన వైనాన్ని ఆ కథనంలో వివరించారు. ఈ నేపథ్యంలో విపక్షాలు అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కేసును వాదించేందుకు సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ లాయర్ కు అనుమతినివ్వడం మరో వివాదానికి కారణమైంది.
ఈ నేపథ్యంలో బీజేపీ అనుబంధ సంస్థగా పేరొందిన ఆర్ఎస్ఎస్ దీనిపై స్పందించింది. భోపాల్ లో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ సమావేశం సందర్భంగా ఆరెస్సెస్ జాయింట్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోసాబాలే మాట్లాడుతూ, ఎవరిపైనైనా అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వారిపై తప్పక విచారణ జరగాలని అన్నారు. అయితే, అందుకు తగిన ప్రాథమిక ఆధారాలు ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఆయనపై ఆరోపణలు చేసిన వారు వాటిని నిరూపించాలని ఆయన సూచించారు.