nasa: నాసా రోవర్ చాలెంజ్ కి ఎంపికైన ఐదుగురు తెలుగు విద్యార్థులు
- వరంగల్ ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు
- ఫైనల్ కి క్వాలిఫై అయిన ఐదుగురు సభ్యుల టీమ్
- ఎంతో ఆనందంగా ఉందంటున్న విద్యార్థులు
వచ్చే సంవత్సరం అమెరికాలో నాసా నిర్వహించే ఐదవ విడత హ్యూమన్ ఎక్స్ ప్లోరేషన్ రోవర్ చాలెంజ్ లో పాల్గొనే అరుదైన అవకాశం ఐదుగురు తెలుగు విద్యార్థులకు దక్కింది. వరంగల్ లోని ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ఐదుగురి టీమ్, ఫైనల్ చాలెంజ్ కి క్వాలిఫై అయింది. చంద్రుడిపై తిరిగేందుకు అవసరమయ్యే వాహనం ఎలా ఉండాలి? దాని డిజైన్ పై వీరి ఐడియా, ప్రయాణికుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై వీరు సమర్పించిన రిపోర్టు తుది రౌండుకు అర్హత పొందిందని కాలేజీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇండియా నుంచి కేవలం నాలుగు టీములు మాత్రమే నాసా రోవర్ చాలెంజ్ లో పాల్గొనేందుకు అర్హత సాధించాయని, అందులో తెలుగు రాష్ట్రాల నుంచి తమ టీమ్ మాత్రమే ఉందని కాలేజీ యాజమాన్యం పేర్కొంది. ఈసీఈ బ్రాంచిలో తుది సంవత్సరం చదువుతున్న పాల్ వినీత్, పీ శ్రవణ్ రావు, మెకానికల్ విభాగం ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రకాశ్ రైనేని, ఆర్ దిలీప్ రెడ్డి, సివిల్స్ ఫైనల్ ఇయర్ లో ఉన్న వీ స్నేహ రోవర్ చాలెంజ్ లో పాల్గొననున్నారని తెలిపింది. మరో ప్రపంచం ఎలా ఉంటుందన్న ఊహతో, అక్కడ ఎలాంటి ఉపరితలం ఉన్నా, దానిపై క్షేమంగా, సులువుగా ప్రయాణించే వాహనాలను తయారు చేసే చాలెంజ్ లో పాల్గొనే అవకాశం తమకు రావడం ఎంతో సంతోషంగా ఉందని విద్యార్థులు అంటున్నారు.