TTD: తిరుమల తొలి ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండ చరియలు.. రాకపోకల నిలిపివేత!
- వర్షాల కారణంగా కూలిన చెట్లు, బండరాళ్లు
- తిరుమల నుంచి రాకపోకల నిలిపివేత
- సహాయక చర్యలు చేపట్టిన టీటీడీ
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిరుమల నుంచి తిరుపతికి రావాల్సిన వాహనాలను కొండపై ఉన్న టోల్ గేటుకు ఆవలే నిలిపివేస్తుండటంతో, తిరుమల ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం వాహనాలతో నిండిపోయింది. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది రోడ్డుపై ఉన్న బండరాళ్లను, చెట్లను తొలగించే పనిలో ఉన్నారు.
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగానే మట్టితో కూడిన బండలు నాని రహదారిపైకి పడ్డాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఏ వాహనానికీ ఎటువంటి ప్రమాదమూ జరగలేదని అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల సమయానికి రాకపోకలను పునరుద్ధరిస్తామని అన్నారు. కాగా, వారాంతం సమీపించడంతో తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. జనవరి నెల శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన లక్కీ డిప్ విజేతల వివరాలను నేటి మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వెల్లడించనుంది.