kalifornia: కాలిఫోర్నియా కార్చిచ్చు... అధికారిక లెక్కల్లో మరణాలు 31... ఆచూకీ లేనివారి సంఖ్య వేలల్లో!
- ఇంకా అదుపులోకి రాని దావానలం
- శ్రమిస్తున్న 8 వేల మంది
- గాలులు తీవ్ర అధికంగా ఉండటం ప్రతికూలం
- పక్క నగరాలపైకి బూడిద మేఘాలు
కాలిఫోర్నియా అడవుల్లో రగులుకున్న దావానలం ఎంతమాత్రమూ అదుపులోకి రాకపోగా, మంటల్లో దహనమైన వారి సంఖ్య 31కి పెరిగింది. ఇది కేవలం అధికారిక లెక్కల ప్రకారం మాత్రమే. అయితే, కాలిఫోర్నియా రాష్ట్రంలోని అడవులకు దగ్గరగా ఉన్న పట్టణాలు, గ్రామాల్లో నివాసాలు ఉంటున్న వారిలో ఎంతో మంది ఆచూకీ తెలియరావడం లేదని సమాచారం. గంటగంటకూ మంటలు విస్తరిస్తుండగా, సమీప ప్రాంతాల ప్రజలను సురక్షిత స్థలాలకు చేర్చే పనులను అధికారులు చేట్టారు. గత 84 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా మంటలు అడవుల్లో వ్యాపించాయని, 20 ఫైర్ ట్రూప్ లకు చెందిన 8 వేల మంది ఫైర్ ఫైటర్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని అధికారులు తెలిపారు.
కాగా, ఒక్క సోనోమా కౌంటీలోనే వందల మంది ప్రజల ఆచూకీ తెలియడం లేదని తెలుస్తోంది. దీంతో పాటు పలు ప్రాంతాల్లో తమవారు కనిపించడం లేదంటూ వస్తున్న ఫిర్యాదుల సంఖ్య వేలల్లోకి చేరిందని అధికారులు వివరించారు. గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున మంటలను అదుపు చేయడం క్లిష్టతరంగా ఉందని చెబుతున్నారు. మొత్తం 1.90 లక్షల ఎకరాల్లో మంటలను ఆర్పివేయాల్సి వుందని, దాదాపు న్యూయార్క్ నగరమంత విస్తీర్ణంలోని అడవులు పూర్తిగా తగులబడ్డాయని కాలిఫోర్నియా గవర్నర్ ప్రకటించారు.
అటవీ ప్రాంతాలకు పక్కనే ఉన్న 3,500 భవనాలకు మంటలు అంటుకున్నాయని తెలిపారు. పక్కనే ఉన్న శాంటారోసా తదితర నగరాలపైకి బూడిద, పొగ మేఘాలు వ్యాపిస్తున్నాయని తెలుస్తోంది. అడవుల్లో మంట అంటుకోవడానికి గల కారణాలు తెలియడం లేదని, దీనిపై విచారణకు ఆదేశించామని అధికారులు తెలిపారు.